
న్యూఢిల్లీ: దేశీయంగా ఏప్రిల్‌లో 1.43 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 1.32 కోట్లతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 8.45 శాతం పెరిగింది. మార్కెట్ వాటాపరంగా చూస్తే 64.1 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో ఎయిరిండియా గ్రూప్ (27.2 శాతం), ఆకాశ ఎయిర్ (5 శాతం), స్పైస్‌జెట్ (2.6 శాతం) ఉన్నాయి.
2025 జనవరి–ఏప్రిల్ మధ్యకాలంలో దేశీ విమానయాన సంస్థలు 5.75 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నెలవారీ రిపోర్టులో వెల్లడించింది. వార్షికంగా చూస్తే ఈ సంఖ్య 9.87 శాతం, నెలవారీగా చూస్తే 8.45 శాతం పెరిగినట్లు వివరించింది.
సమయ పాలనపరంగా (ఓటీపీ) చూస్తే 80.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉంది. 77.5 శాతం ఓటీపీతో ఆకాశ ఎయిర్, 72.4 శాతంతో ఎయిరిండియా గ్రూప్ .. ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. స్పైస్‌జెట్ సమయ పాలన అత్యంత కనిష్ట స్థాయిలో 60 శాతంగా నమోదైంది.