రూ.3,000 కోట్ల టర్నోవర్‌ దిశగా డిజిట్‌ ఇన్సూరెన్స్‌

Digit Insurance Expects Break Even Fiscal And Three Thousand Crore crossed - Sakshi

2020–21లో నష్టాలు, లాభాల్లేని స్థితికి 

డిజిట్‌ ఇన్సూరెన్స్‌ చైర్మన్‌ కామేష్‌గోయల్‌

ముంబై: ఆన్‌లైన్‌ సాధారణ బీమా సంస్థ ‘డిజిట్‌ ఇన్సూరెన్స్‌’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే లాభ, నష్టాల్లేని స్థితికి చేరుకుంటుందని కంపెనీ చైర్మన్‌ కామేష్‌గోయల్‌ తెలిపారు. కెనడాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ బిలియనీర్‌ ప్రేమ్‌వత్సకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ ఈ కంపెనీ ప్రమోటర్‌గా ఉంది. ఇప్పటికే 140 మిలియన్‌ డాలర్ల నిధులను (రూ.1,036 కోట్లు) డిజిట్‌లో ఇన్వెస్ట్‌ చేసింది. బెంగళూరు కేంద్రంగా 2017 డిసెంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన డిజిట్‌ ఇన్సూరెన్స్‌లో ఏ91 పార్ట్‌నర్స్, ఫేరింగ్‌ క్యాపిటల్, టీవీఎస్‌ క్యాపిటల్‌ కూడా పెట్టుబడులు పెట్టాయి. డిజిట్‌ ఇన్సూరెన్స్‌ రెండో ఏడాది (2019–20) రూ.2,252 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసిందని, 2018–19లో వచ్చిన రూ.1,205 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు87 శాతం పెరిగిందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల టర్నోవర్‌ మార్క్‌ను అధిగమిస్తామని కామేష్‌ గోయల్‌ వివరించారు.

ప్రమోటర్లు ఇప్పటి వరకు రూ.1,650 కోట్ల నిధులను సమకూర్చారని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సాధనకు అదనపు నిధుల అవసరం లేదన్నారు. ఆగస్ట్‌ నెలలో మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీల విక్రయాల్లో 87 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపారు. కానీ, పరిశ్రమ వృద్ధి ఒక శాతంగానే ఉందన్నారు. తమ మోటారు, హెల్త్‌పాలసీలకు మంచి డిమాండ్‌ ఉన్నట్టు చెప్పారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వల్ప లాభం నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. తొలి ఏడాది కార్యకలాపాలపై తాము రూ.425 కోట్ల నష్టాన్ని నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. మోటారు ఇన్సూరెన్స్‌లో తమకు 2.6 శాతం వాటా ఉందని, మొత్తం మీద సాధారణ బీమాలో 1.54 శాతం వాటా జూన్‌ చివరి నాటికి ఉన్నట్టు కామేష్‌గోయల్‌ వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top