
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్‌లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై,
బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
మారియట్, తాజ్, లీలా, ఇంటర్‌కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్‌మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.
బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే?
స్టార్ హోటల్ సేవలు, అపార్ట్‌మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్‌లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు.
హెచ్‌ఎన్‌ఐ, ప్రవాసులు కస్టమర్లు..
కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్‌ఎన్‌ఐలు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.

ఎక్కడ వస్తున్నాయంటే..
దేశంలోని విలాసవంతమైన మార్కెట్‌లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్‌లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.
ప్రైవసీ, భద్రత..
కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్‌తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్‌లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్‌టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.
ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్..
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్‌మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment