డెల్టా కార్ప్‌కు మరో రూ.6,384 కోట్ల జీఎస్‌టీ నోటీస్‌

Delta Corp Gets Rs 6,384 Crore Notice For Short Payment Of GST - Sakshi

రూ.23,000 కోట్లు దాటిన పన్ను డిమాండ్‌

9 శాతం పడిన షేర్‌ ధర  

న్యూఢిల్లీ: డెల్టా కార్ప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రూ. 6,384 కోట్ల  షార్ట్‌ పేమెంట్‌ కోసం ఒక జీఎస్‌టీ నోటీసును అందుకుంది, దీనితో కంపెనీపై మొత్తం పన్ను డిమాండ్‌ దాదాపు రూ. 23,000 కోట్లు దాటింది. పన్ను డిమాండ్లు ఏకపక్ష మైనవని, చట్ట  విరుద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లూ వెల్లడించింది. సంస్థ ప్రకటన ప్రకారం,  డీజీజీఐ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌), కోల్‌కతా విభాగం అక్టోబర్‌ 13న డెల్టా కార్ప్‌ అనుబంధ సంస్థ అయిన డెల్టాటెక్‌ గేమింగ్‌కు జీఎస్‌టీ నోటీసు పంపుతూ, జనవరి 2018 నుండి నవంబర్‌ 2022 కాలానికి సంబంధించి  రూ. 6,236.8 కోట్ల పన్ను చెల్లింపుల డిమాండ్‌ చేసింది.

జూలై 2017 నుండి అక్టోబర్‌ 2022 వరకు మరో 147.5 కోట్ల రూపాయల పన్ను డిమాండ్‌ నోటీసునూ అందించింది. రూ. 16,800 కోట్ల షార్ట్‌ పేమెంట్‌ నిమ్తి్తం కంపెనీకి గత నెలలో షోకాజ్‌ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు, కాసినోలు తమ ప్లాట్‌ఫారమ్‌లపై ఉంచిన స్థూల పందెం విలువపై 28 శాతం జీఎస్‌టీ చెల్లించవలసి ఉంటుందని ఆగస్టులో జీఎస్‌టీ అత్యున్నత స్థాయి మండలి నిర్ణయం తీసుకుంది.  ఈ నేపథ్యంలో కంపెనీకి తాజా జీఎస్‌టీ నోటీసులు వెలువడ్డం గమనార్హం. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్‌ కంపెనీలకు రెట్రాస్పెక్టివ్‌ ప్రాతిపదికన జీఎస్‌టీ పన్ను డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్లు  కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) చైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ ఇటీవల స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వస్తున్నట్లు తెలిపారు.  

తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో డెల్టా కార్ప్‌ షేర్‌ ధర 9 శాతం పడిపోయి రూ.120కి పడింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top