హైదరాబాద్: దేశీయంగా తయారు చేసిన సీ295 మిలిటరీ రవాణా విమానాల డెలివరీలను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అందించనున్నట్లు విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్ హెడ్ (డిఫెన్స్, స్పేస్–భారత్, దక్షిణాసియా) వెంకట్ కె. తెలిపారు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి మొత్తం 56 విమానాలను అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు స్పెయిన్లో తయారు చేసిన 16 విమానాలను సరఫరా చేసినట్లు వివరించారు. 2031 నాటికి మరో 40 విమానాలను అందించాల్సి ఉందని చెప్పారు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టం (టీఏఎస్‌ఎల్) భాగస్వామ్యంతో ఎయిర్‌బస్ వీటిని తయారు చేస్తోంది.
తెలంగాణలోని ఆదిభట్లలో కొంత భాగాన్ని, వదోదరలో తుది అసెంబ్లింగ్ చేసి వీటిని అందించనుంది. విమానానికి సంబంధించి 14,500 పైచిలుకు విడిభాగాల్లో 13,500 పైగా విడిభాగాలను ఇక్కడే తయారు చేస్తున్నట్లు వెంకట్ చెప్పారు.


