
దేశవ్యాప్తంగా అభివృద్ధి ఇక వేగవంతం
స్వదేశీ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం
పేదలు, మధ్య తరగతి సహా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి
దేశంలో ప్రతి ఇంటినీ స్వదేశీకి ప్రతీకగా మార్చుకోవాలి
దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
పౌరులకు ‘డబుల్ బొనాంజా’ ఇచ్చామని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తదుపరి తరం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలతో దేశవ్యాప్తంగా అభివృద్ధి వేగం పుంజుకోనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధన దిశగా ఇది అతిపెద్ద, కీలకమైన అడుగు అని అభివర్ణించారు. దేశ సౌభాగ్యం కోసం స్వదేశీ ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. జీఎస్టీ సంస్కరణలు సోమవారం నుంచే అమల్లోకి రాబోతున్నాయని, నిత్యావసరాల ధరలు తగ్గుతాయని, పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.
నవరాత్రులను పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘స్వదేశీ’ ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటానికి కొత్త శక్తిని ఇచి్చందని గుర్తుచేశారు. ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తులు ఉపయోగించుకుంటే దేశ ఆర్థిక ప్రగతికి నూతన బలం చేకూరుతుందని వెల్లడించారు. దేశంలో ప్రతి ఇంటినీ స్వదేశీకి ప్రతీకగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి దుకాణాన్నీ స్వదేశీ వస్తువులతో అలంకరించాలని పిలుపునిచ్చారు.
రూ.12 లక్షల దాకా ఆదాయంపై ఇప్పటికే పన్ను మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని, ఈ రెండూ దేశ పౌరులకు ‘డబుల్ బోనాంజా’ అని స్పష్టంచేశారు. దీనివల్ల ఖర్చులు తగ్గి, డబ్బులు ఆదా చేయడం పెరుగుతుందని, తద్వారా ప్రజలు వారి కలలు నిజం చేసుకోవడానికి అవకాశం దక్కుతుందని వ్యాఖ్యానించారు. రెండు కీలక నిర్ణయాల వల్ల ప్రజలకు రూ.2.5 లక్షల కోట్లు ఆదా అవుతాయని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..
నాగరిక్ దేవో భవ
‘‘మన దేశం స్వావలంబన సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలి. తయారీ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలి. ప్రజలు ‘మేన్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులు విస్తృతంగా ఉపయోగించాలి. స్వదేశీ ఉత్పతుల కొనుగోలు, విక్రయం మన ధ్యేయం కావాలి. మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే వాడుకుంటున్నామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడు మన దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తుంది. నాగరిక్ దేవో భవ(ప్రజలే దేవుళ్లు) అనేదే మా విధానం. ప్రజలకు మేలు చేయాలన్న తలంపుతోనే జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం.
ఈ నిర్ణయంతో కీలకమైన నిత్యావసర వస్తువులు, సేవల ధరలు తగ్గుతాయి. నిర్మాణం, ఆరోగ్య రంగంలోనూ ఖర్చులు తగ్గిపోతాయి. సోమవారం నుంచి ‘జీఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్’ ప్రారంభం కానుంది. ప్రతి కుటుంబానికీ సంతోషం తీసుకొస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ కోసం ఈ నవరాత్రుల్లో తొలి రోజు దేశం కీలకమైన అడుగు వేయబోతోంది. మీకు ఇష్టమైన వస్తువులు తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. పేదలు, మధ్య తరగతి, యువత, రైతులు, మహిళలు, వ్యాపారులు, దుకాణదారులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారు. దేశంలో సులభతర వాణిజ్యం ఊపందుకుంటుంది. భారీగా పెట్టుబడులు వస్తాయి’’ అని మోదీ చెప్పారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు..
‘‘2017లో జీఎస్టీ సంస్కరణలు ఆరంభించాం. చరిత్ర లిఖించడానికి అప్పుడే అడుగు పడింది. ఒకే దేశం–ఒకే పన్ను అనే స్వప్నాన్ని జీఎస్టీ నిజం చేసింది. గతంలో రకరకాల పన్నులు, సుంకాల వల్ల వ్యాపారులకు, వినియోగదారులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. పన్నుల భారాన్ని వ్యాపారులు జనంపైనే వేసేవారు. జీఎస్టీతో ఆ కష్టాలకు చరమగీతం పాడేశాం. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఓ విదేశీ పత్రికలో వార్త చదివా.
బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు సరుకులు చేరవేయడం ఓ కంపెనీకి పెద్ద సవాలుగా మారిందని అందులో రాశారు. పలు రకాల పన్నులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. దానికి బదులు తొలుత యూరప్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేర్చడమే సులభమని ప్రస్తావించారు. అందుకే పన్నులపరంగా అవరోధాలు తొలగించాలని నిర్ణయించాం. అన్ని రాష్ట్రాలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించి, జీఎస్టీని తీసుకొచ్చాం’’ అని ప్రధాన మంత్రి ‘మోదీ వివరించారు.
ఇకనుంచి 5, 18% శ్లాబ్‌లే..
‘సంస్కరణలతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) సైతం ప్రయోజనం పొందుతాయి. మేన్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని ఎంఎస్‌ఎంఈలను కోరుతున్నా. స్వావలంబన భారత్ నిర్మాణంలో ఎంఎస్‌ఎంఈలదే కీలక పాత్ర. సాధ్యమైనంత ఎక్కువగా మన దేశంలోనే వస్తువులు ఉత్పత్తి చేయాలి. మనం ఉపయోగించుకుంటున్న వస్తువు ఎక్కడ తయారైందో ప్రజలు తెలుసుకోవాలి.
నిత్యం వాడుతున్న దువ్వెన ఎక్కడ తయారు చేశారో కూడా చాలామందికి తెలియదు. విదేశీ వస్తువులకు ప్రాధాన్యం వేయడం సరైంది కాదు. ఇకపై స్వదేశీ ఉత్పత్తులకే పెద్దపీట వేద్దాం. తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనం ప్రజలకు దక్కేలా పరిశ్రమ వర్గాలు చొరవ చూపుతుండడం సంతోషంగా ఉంది. ఇకనుంచి 5 శాతం, 18 శాతం ట్యాక్స్ శ్లాబ్‌లే ఉంటాయి. గతంలో 12 శాతం పన్ను శ్లాబ్‌లో ఉన్న 99 శాతం వస్తువులను 5 శాతం పన్ను శ్లాబ్‌లోకి తీసుకొచ్చాం. ఫలితంగా వాటి ధరలు గణనీయంగా తగ్గిపోతాయి’ అని మోదీ అన్నారు.