సమస్యను స్థానిక నాయకులే పరిష్కరించుకోవాలి
కర్ణాటక సీఎం కుర్చీ వివాదంపై ఖర్గే కీలక వ్యాఖ్యలు
శివాజీనగర: కర్ణాటకలో సీఎం పదవి వివాదంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం కల్బుర్గిలో మీడియాతో మాట్లాడుతూ ‘దీనిని హైకమాండ్ సృష్టించలేదు. గందరగోళానికి హైకమాండ్ కారణం కాదు. స్థానిక నాయకులే గొడవ చేసుకున్నారు. వారే దీనిని పరిష్కరించుకోవాలి. అన్నిటికీ హైకమాండ్‌ను అంటే ఎలా?’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎవరో ఒక నాయకుడి వల్ల బలపడలేదని, తన వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని, తానే పార్టీ కోసం శ్రమించానని ఎవ్వరూ చెప్పరాదని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ అనేది కార్యకర్తల ద్వారా విస్తరించిన పార్టీ. పార్టీ అన్న తరువాత అందరి పాత్ర ఉంటుంది. ఫలానా వారే పార్టీకి ఆధారం అని కార్యకర్తలు కూడా అనరాదు’ అని సూచించారు.
సోదరుల్లాగా పనిచేసుకుంటున్నాం: శివకుమార్
మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదివారం బెంగళూరులో తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తనకు కాంగ్రెస్‌లో ఏ నాయకుడితో భిన్నాభిప్రాయాలు లేవన్నారు. అవన్నీ మీడియా, ప్రతిపక్షాల సృష్టి అని పేర్కొన్నారు. తాను, సీఎం సిద్ధరామయ్య కలసికట్టుగా సోదరుల్లాగా పని చేయడం లేదా? అని ప్రశి్నంచారు. ‘కొన్ని సందర్భాల్లో రాజకీయంగా వ్యాఖ్యలు చేసి ఉంటారు.
ఇందుకు అసంతృప్తికి గురికావాలా?, అన్నదమ్ములే గొడవపడుతుంటారు. ఇక మా గొడవ అనేది ఏ లెక్కకు వస్తుంది?’ అని ప్రశ్నించారు. పార్టీలో గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని మల్లికార్జున ఖర్గేకు కొందరు నాయకులు లేఖ రాయడంపై మాట్లాడుతూ, ‘నా వరకు ఎలాంటి గందరగోళం లేదు. మీడియాకు వార్తలు కావాలి, అందుకోసమే రోజూ గందరగోళం చేయిస్తున్నారు’ అని అన్నారు.
సీఎం సన్నిహిత వర్గానికి చెందిన నేత కేఎన్ రాజన్న కలవడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ‘ఆయనకు సీఎం సన్నిహితుడా?, నాకు కూడా సన్నిహితుడే’ అని చమత్కరించారు.


