
2030 నాటికి డెకాథ్లాన్ లక్ష్యం
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో (2030 నాటికి) తమ గ్లోబల్ కార్యకలాపాల కోసం భారత్ నుంచి కొనుగోళ్లను 3 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు (సుమారు రూ. 25,500 కోట్లు) ఫ్రాన్స్‌కి చెందిన స్పోర్ట్స్ రిటైలింగ్ సంస్థ డెకాథ్లాన్ తెలిపింది. తాము గత 25 ఏళ్లుగా భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నామని, మేకిన్ ఇండియా విజన్‌కి కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రొడక్షన్ హెడ్ ఫ్రెడరిక్ మెర్లివీడ్ తెలిపారు. ప్రస్తుతం తాము అంతర్జాతీయంగా జరిపే కొనుగోళ్ల పరిమాణంలో భారత్ వాటా 8 శాతంగా ఉందని, 2030 నాటికి దీన్ని 15 శాతానికి పెంచుకోనున్నామని చెప్పారు.
భారత్‌లో విక్రయాల పరిమాణంలో 70 శాతం వాటా దేశీ సోర్సింగ్‌దే ఉంటోందని, దీన్ని 90 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. నాణ్యత, వేగం, కొత్త ఆవిష్కరణలపరంగా భారత్, తమ గ్లోబల్ తయారీ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోందని ఫ్రెడరిక్ చెప్పారు. డెకాథ్లాన్‌కి భారత్‌లో ఒక డిజైన్ సెంటర్, 83 సరఫరాదార్లు, 113 తయారీ యూనిట్లు, 55 నగరాల్లో 132 స్టోర్స్ ఉన్నాయి. రిటైల్, తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ.933 కోట్లు (100 మిలియన్ యూరోలు) ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెకాథ్లాన్ భారత మార్కెట్లో రూ. 4,000 కోట్ల ఆదాయం, రూ. 197 కోట్ల లాభం ఆర్జించింది.