breaking news
from India
-
భారత్ నుంచి 3 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో (2030 నాటికి) తమ గ్లోబల్ కార్యకలాపాల కోసం భారత్ నుంచి కొనుగోళ్లను 3 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు (సుమారు రూ. 25,500 కోట్లు) ఫ్రాన్స్‌కి చెందిన స్పోర్ట్స్ రిటైలింగ్ సంస్థ డెకాథ్లాన్ తెలిపింది. తాము గత 25 ఏళ్లుగా భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నామని, మేకిన్ ఇండియా విజన్‌కి కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రొడక్షన్ హెడ్ ఫ్రెడరిక్ మెర్లివీడ్ తెలిపారు. ప్రస్తుతం తాము అంతర్జాతీయంగా జరిపే కొనుగోళ్ల పరిమాణంలో భారత్ వాటా 8 శాతంగా ఉందని, 2030 నాటికి దీన్ని 15 శాతానికి పెంచుకోనున్నామని చెప్పారు. భారత్‌లో విక్రయాల పరిమాణంలో 70 శాతం వాటా దేశీ సోర్సింగ్‌దే ఉంటోందని, దీన్ని 90 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. నాణ్యత, వేగం, కొత్త ఆవిష్కరణలపరంగా భారత్, తమ గ్లోబల్ తయారీ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోందని ఫ్రెడరిక్ చెప్పారు. డెకాథ్లాన్కి భారత్‌లో ఒక డిజైన్ సెంటర్, 83 సరఫరాదార్లు, 113 తయారీ యూనిట్లు, 55 నగరాల్లో 132 స్టోర్స్ ఉన్నాయి. రిటైల్, తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ.933 కోట్లు (100 మిలియన్ యూరోలు) ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెకాథ్లాన్ భారత మార్కెట్లో రూ. 4,000 కోట్ల ఆదాయం, రూ. 197 కోట్ల లాభం ఆర్జించింది. -
9/11 దాడులకు భారత్ నుంచి నిధులు!
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల చర్యల్లో అత్యంత హేయమైనదిగా భావించే 9/11 దాడికి భారత్ నుంచి నిధులు వెళ్లాయి. పేలుడు పదార్థాల తయారీ, విమానాల హైజాక్ నుంచి ట్విన్ టవర్స్ కూల్చివేత వరకు పథకాన్ని పక్కాగా అమలుపర్చేందుకు ఉగ్రవాదులు బోలెడు డబ్బు ఖర్చయింది. అందులో కొంత భారత్ నుంచి సమకూరింది. అది ఎలాగంటే.. కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్ పై దాడి (జనవరి 2, 2002) కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ప్రస్తుతం జైలులో ఉంటోన్న అఫ్తాబ్ అన్సారీ.. తన గ్యాంగ్‌తో కలిసి 2001లో ఖాదీమ్ వ్యాపార సంస్థల అధిపతి పార్థా ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశాడు. బాధితుడ్ని విడిచిపెట్టే క్రమంలో భారీగా సొమ్ము చేతులు మారింది. అప్పటికే దుబాయ్ నేర సామ్రాజ్యాధిపతులు, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల నాయకులతో సంబంధాలున్న అఫ్తాబ్.. బర్మన్ కిడ్నాప్ ద్వారా లభించిన సొమ్ములో కొంత భాగాన్ని షేక్ ఒమర్ కు పంపాడు. ఈ షేక్ ఒమర్ ఎవరంటే.. 1999 కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో భారత్ విడిచిపెట్టిన ఉగ్రవాదుల్లో ఒకడు షేక్ ఒమర్. సొంత సంస్థ హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ తోపాటు తాలిబన్లతో కలిసి కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతను మొహమ్మద్ అట్టాకు అత్యంత నమ్మకస్తుడు. ఈ అట్టాయే 9/11 దాడుల కీలక సూత్రధారి. ఒమర్ కు... అన్సారీ నమ్మినబంటు కావడంతో అడిగిందే తడవుగా తన దగ్గరున్న డబ్బును పాక్ కు చేరవేశాడు . అలా ఆ సొమ్ము ట్విన్ టవర్స్ కూల్చివేతకు వినియోగించారు. దాడుల అనంతరం అట్టాను ఎఫ్ బీఐ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా స్వయంగా అట్టాయే ఈ విషయాలు వెల్లడించాడని, ఆమేరకు ఎఫ్ బీఐ అధికారి జాన్ పిస్టోల్ తన రిపోర్టులో అట్టా వాగ్మూలాన్ని నమోదుచేశారు. ఇక్కడ మనం చదివింది కేవలం ఒక ఊహ కాదు.. సాక్షాత్తూ ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ తన పుస్తకంలో వెల్లడించిన విషయాలు. నాలుగేళ్ల కిందట రిటైర్మెంట్ తీసుకున్న ఆయన.. తన ఉద్యోగానుభవాలను క్రోడీకరిస్తూ ఓ పుస్తకాన్ని రాశారు. అందులో తాను సీబీఐలో పనిచేసిప్పుడు ఎదురైన అనుభవాలను పొందుపర్చారు. 9/11 దాడులకు భారత్ నుంచి నిధులు ఎలా వెళ్లింది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఫోన్ లో ఏం మాట్లాడింది, దావూద్, అతని సోదరుడు అనీస్ ల నుంచి ఎలాంటి అభ్యర్థనలు ఎదురైంది పూసగుచ్చినట్లు వివరించారు. నీరజ్ కుమార్ ప్రస్తుతం బీసీసీఐ అవినీతి నిరోధక శాఖకు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.