ధోనీ టీం ధనా ధన్‌.. స్పోర్ట్స్‌లో తొలి యూనికార్న్‌ ఛాన్స్‌! ఇండియన్‌ సిమెంట్స్‌ను దాటేసి..

CSK on course to become India first sports unicorn - Sakshi

న్యూఢిల్లీ: భారత మార్కెట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆశ్చర్యకర పరిణామాలకు కారణం కాబోతోంది.   ధనా ధన్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఇటు ఐపీఎల్‌ లీగ్‌పరంగానే కాకుండా అటు మార్కెట్‌ వేల్యుయేషన్‌పరంగానూ దుమ్ము రేపుతోంది.  ఏకంగా క్రీడా రంగంలో తొలి యూనికార్న్‌ (1 బిలియన్‌ డాలర్ల పైగా విలువ) హోదా దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. ఈ విషయంలో మాతృ సంస్థ ఇండియా సిమెంట్స్‌ వేల్యుయేషన్‌ను కూడా దాటిపోతుండడం మరో విశేషం.
 

ఈమధ్యే నాలుగోసారి లీగ్‌ను గెల్చుకోవడంతో సీఎస్‌కే టీమ్‌ విలువపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వచ్చే సీజన్‌లో రెండు జట్లకు చోటు కల్పించనున్నారని, వీటి విలువను సుమారు రూ. 4,000– 5,000 కోట్లుగా లెక్కించనున్నారని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టి చూస్తే, తొలి నుంచి నిలకడగా రాణిస్తున్న సీఎస్‌కే వేల్యుయేషన్‌ దాదాపు రెట్టింపు స్థాయికి చేరవచ్చని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘‘గత శుక్రవారం అనధికారిక మార్కెట్లో సీఎస్‌కే షేరు ధర రూ. 135గా ఉంది. దీని ప్రకారం సీఎస్‌కే మార్కెట్‌ వేల్యుయేషన్‌ సుమారు రూ. 4,200 కోట్లు. అయితే, కొత్తగా వచ్చే జట్ల విలువ దాదాపు రూ. 4,000– 5,000 కోట్లుగా ఉంటే సీఎస్‌కే రిటైల్‌ షేరు ధర ఏకంగా రూ. 200కి చేరవచ్చు. దీంతో టీమ్‌ విలువ రూ. 8,000 కోట్లకు ఎగియవచ్చు. తద్వారా యూనికార్న్‌గా మారవచ్చు’’ అని పేర్కొన్నాయి. మరోవైపు, మంగళవారం నాటి పరిస్థితుల ప్రకారం సీఎస్‌కే మాతృ సంస్థ ఇండి యా సిమెంట్స్‌ (బాంబే స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలో షేరు ధర రూ. 205) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 6,343 కోట్లుగా ఉంది. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే సీఎస్‌కే విలువ ఇండియా సిమెంట్స్‌ వేల్యుయేషన్‌ను కూడా దాటిపోనుంది. 

ఇండియా సిమెంట్స్‌కు ఊతం
ఇండియా సిమెంట్స్‌ ఎండీ ఎన్‌ శ్రీనివాసన్‌ కూడా ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎస్‌కే విలువ.. మాతృ సంస్థ వేల్యుయేషన్‌ను దాటేసే అవకాశాలపై ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఫ్రాంచైజీ లీగ్‌లు మరింతగా ప్రాచుర్యంలోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరో సందర్భంలో ఇండియా సిమెంట్స్‌కు సీఎస్‌కే ఊతంగా నిలుస్తోందంటూ ఆయన అంగీకరించారు. ‘‘ఇండియా సిమెంట్స్‌ నెలకొల్పి 75 ఏళ్లవుతోంది. అది స్వయంగా ఒక పటిష్టమైన బ్రాండ్‌. కానీ ఇప్పుడు సీఎస్‌కే మాతృ సంస్థగా గుర్తింపు పొందుతోంది. సీఎస్‌కే అనతికాలంలోనే ఇండియా సిమెంట్స్‌ ప్రాచుర్యాన్ని అధిగమించింది’’ అని శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ‘‘సీఎస్‌కే స్వయంగా ఒక భారీ బ్రాండ్‌గా ఆవిర్భవిస్తోంది. వేల్యుయేషన్‌ గణనీయంగా పెరుగుతోంది. అయితే, ఇండియా సిమెంట్స్‌ దీన్నేమీ విక్రయించకపోవచ్చు. ఎందుకుంటే బ్రాండింగ్‌పరంగా ఇది మాతృ సంస్థకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది’’ అని బ్రాండ్‌ మార్కెటింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఇండియా సిమెంట్స్‌ 75వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎస్‌కే టీమ్‌ ప్లేయర్లు సందడి చేయడం ఇందుకు నిదర్శనంగా తెలిపాయి. సీఎస్‌కే టీమ్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అటు ఇండియా సిమెంట్స్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నారు.

 

నిలకడగా రాణింపు
2008లో ఐపీఎల్‌ ప్రారంభించినప్పట్నుంచీ .. మిగతా టీమ్‌లతో పోలిస్తే సీఎస్‌కే నిలకడగా రాణిస్తోంది. 196 మ్యాచ్‌లలో 117 మ్యాచ్‌లలో గెలుపొంది.. 59.69 శాతం విజయాల రేట్‌తో కొనసాగుతోంది. ధోనీ సారథ్యంలో సీఎస్‌కే ఇప్పటికే పటిష్టమైన బ్రాండ్‌గా ఎదిగిందని, ఒకవేళ రేపు ఎప్పుడైనా అతను తప్పుకున్నా కూడా దాని ప్రాభవం తగ్గకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడ్డాయి. సీఎస్‌కే టీమ్‌ నిర్వహణ తీరు ఇందుకు కారణమని వివరించాయి. ‘‘మంచి బ్రాండ్స్‌ ఎలా వ్యవహరించాలన్నది సీఎస్‌కే చూపించింది. నిలకడగా రాణించడం,   ప్రజల ఆప్యాయతను చూరగొనడం ఇలా అన్ని కీలకమైన అంశాల్లోనూ ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది.  పనితీరులో నిలకడగా రాణిస్తోంది. మిగతా బడా పారిశ్రామిక దిగ్గజాలకు చెందిన టీమ్‌లను ధైర్యంగా ఎదుర్కొని, నిలబడగలుగుతోంది. పేరుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ అయినప్పటికీ చెన్నై పరిధిని దాటి దేశవ్యాప్తంగా అందరూ ఇష్టపడే టీమ్‌గా ఎదిగింది’’ అని పేర్కొన్నాయి.

చదవండి: ఇన్వెస్టర్లకు ఐఆర్‌సీటీసీ షాక్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top