లబోదిబో... అయ్యో ఇదెక్కడి దారుణం.. ఇన్వెస్టర్లకు ఐఆర్‌సీటీసీ షాక్‌

IRCTC Share Value Declined Drastically In last Hour - Sakshi

నెలరోజులుగా లాభాలే తప్ప నష్టాలు అంటూ లేకుండా అప్రతిహాతంగా దూసుకు పోతున్న ఐఆర్‌సీటీసీకి బ్రేక్‌ పడింది. సెషన్ల వారీగా లాభాలు వస్తుండటంతో ఎంతో నమ్మకంతో ఈ రోజు ఆ కంపెనీ షేర్లు కొన్న వారు నిలువునా మునిగిపోయారు.

ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పోరేషన్‌ షేర్లు ఇన్వెస్టర్లకు కోలుకోలేని షాక్‌ ఇచ్చాయి. 2019లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ కంపెనీ షేర్లు క్రమంగా పెరుగుతూ ముదుపరులకు లాభాలు అందించాయి. కానీ గత సెప్టెంబరు నుంచి ఐఆర్‌సీటీసీ షేర్లు అనూహ్యంగా పెరగడం మొదలైంది. గత సెప్టెంబరు 20న ఐఆర్‌సీటీసీ షేరు విలువ రూ.3,707 లకు చేరుకుంది. దాదాపు లైఫ్‌టైం హైకి చేరుకోవడంతో ఇక అక్కడ విలువ స్థిరపడుతుందని అంతా భావించారు. 

నెలరోజుల్లో
ఇక సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 19 వరకు ఐఆర్‌సీటీసీ షేర్ల ధరకు రెక్కలు వచ్చాయి. మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ, విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ షేర్‌ ధర అమాంతం పెరిగిపోయింది. అక్టోబరు 19న మధ్యాహ్నం 2 గంటల సమయంలో షేరు విలువ రూ.6,323లకు చేరుకుంది. మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ లక్ష కోట్లను దాటింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే లైఫ్‌టైం హైలో కూడా ఇంచుమించు వంద శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో ఈ కంపెనీ షేర్లు కొనేందుకు మరోసారి ఇన్వెస్టర్లు పోటీపడ్డారు.

రెండు గంటల్లోనే
ఐఆర్‌సీటీసీ షేర్ల అనూహ్యంగా పెరుగుతుండటం, నెలరోజులుగా ధర పడిపోతుంది అనుకున్న ప్రతీసారి అందుకు విరుద్ధంగా జరగడంతో ఇన్వెస్టర్లలో ఈ కంపెనీ షేర్లపై ఆసక్తి పెరిగింది. షేర్లకు అనూమ్యమైన డిమాండ్‌ పెరిగింది. మరోవైపు ఈ షేర్ల ధరలు దేశవ్యాప్తంగా మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీయడంతో అప్పటికే షేర్లను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత షేర్ల ధరలు విపరీతమైన ఒత్తడికి లోనయ్యాయి. కేవలం గంట వ్యవధిలోనే షేరు ధర రూ 881లు పడిపోయి రూ.4,996 దగ్గర ఆగింది.

IRCTC Share Price

ఒక్కరోజులో
నిన్న మార్కెట్‌ ముగిసే సమయానికి ఐఆర్‌సీటీసీ షేరు ధర రూ.5,877 దగ్గర ఉంది. ఈ రోజు ప్రారంభం నుంచే మళ్లీ అదే జోరు కనిపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షేరు ధర ఆరు వేల రూపాయలపైనే కొనసాగింది. ఒక దశలో గరిష్టంగా రూ.6,367లను తాకింది. అంతే అప్పటి నుంచి ఒక్కసారిగా ధర కోల్పోవడం మొదలైంది. మొత్తంగా నిన్నటితో పోల్చితే ఒక్క రోజులోనే ఐఆర్‌సీటీసీ షేరు ధర రూ.490 పాయింట్లు పెరిగి  ఒక్కసారిగా ధర రూ.1,371 పతనం అయ్యింది. 

భారీ నష్టాలు
సంస్థాగతంగా ఐఆర్‌సీటీసీ తీసుకున్న చర్యలు, భవిష్యత్తు వ్యూహాలు, వస్తున్న లాభాల కంటే కూడా మార్కెట్‌లో కంపెనీ షేరు వ్యాల్యూ బాగా పెరిగింది. నెల రోజులకు పైగా అదే ట్రెండ్‌ ఉండటంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఇతర కంపెనీ షేర్లు తెగనమ్మి ఐఆర్‌సీటీసీలో పెట్టారు. నెల రోజులుగా వారి అంచనాలు గురి తప్పలేదు. కానీ మంగళవారం ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించాయి. ఒక్కసారిగా ధర నేల ముఖం పట్టడంతో ఇన్వెస్టర్లు విలవిలలాడారు. ముఖ్యంగా మార్కెట్‌కి కొత్తగా వచ్చిన వారు భారీగా నష్టపోయినట్టు మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. 
 

చదవండి: రెండేళ్లలోనే లక్ష కోట్ల రూపాయలు... ఇవి షేర్లా అల్లాఉద్దీన్‌ అద్భుత దీపమా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top