క్రిజాక్‌ ఐపీవో జులై 2న | Crizac Limited IPO on 2 july 2025 | Sakshi
Sakshi News home page

క్రిజాక్‌ ఐపీవో జులై 2న

Jun 29 2025 6:09 AM | Updated on Jun 29 2025 6:09 AM

Crizac Limited IPO on 2 july 2025

రూ. 860 కోట్ల సమీకరణకు సై 

విదేశీ చదువులకు ప్లాట్‌ఫామ్‌!

న్యూఢిల్లీ: విద్యార్థుల రిక్రూట్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే క్రిజాక్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. జులై 2న ప్రారంభంకానున్న ఇష్యూ 4న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు జులై 1న షేర్లను కేటాయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు రూ. 860 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. కాగా.. గతేడాది నవంబర్‌లో రూ. 1,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. 

తాజాగా ఇష్యూ పరిమాణాన్ని రూ. 860 కోట్లకు కుదించింది. తొలుత 2024 మార్చిలో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. అయితే జులైలో ప్రాస్పెక్టస్‌ను సెబీ తిప్పిపంపింది. ఆపై నవంబర్‌లో తిరిగి ఐపీవో చేపట్టేందుకు సెబీ తలుపు తట్టింది. 2025 మార్చిలో అనుమతి పొందింది. గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూషన్స్, ఏజెంట్లకు బీటూబీ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అంతర్జాతీయస్థాయిలో విద్యార్థుల రిక్రూట్‌మెంట్‌ సొల్యూషన్లు అందిస్తోంది.

 ఈ కోల్‌కతా కంపెనీ ద్వారా విద్యార్థులు యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్నత చదువులకు వెళ్లేందుకు గ్లోబల్‌ సంస్థలు తోడ్పాటునిస్తున్నాయి. రిజిస్టర్డ్‌ ఏజెంట్ల ద్వారా గత మూడేళ్లలో 75 దేశాలకుపైగా ఎన్‌రోల్‌మెంట్‌ అప్లికేషన్లకు కంపెనీ ప్లాట్‌ఫామ్‌ వీలు కల్పించింది. సుమారు 7.11 లక్షల విద్యార్థుల అప్లికేషన్ల ప్రాసెస్‌ చేసింది. కాగా.. గతేడాది(2024–25) రూ. 849 కోట్లకుపైగా ఆదాయం, రూ. 153 కోట్ల నికర లాభం ఆర్జించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement