పర్యావరణ పరిరక్షణలో కార్పొరేట్లు | Corporates Step Up Green Initiatives on World Environment Day | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణలో కార్పొరేట్లు

Jun 6 2026 5:16 PM | Updated on Jun 6 2026 6:25 PM

Corporates Step Up Green Initiatives on World Environment Day

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్పొరేట్లు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మైనింగ్‌ దిగ్గజం ఎన్‌ఎండీసీ తమ ప్రాజెక్టులవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉద్యోగులు.. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంపై పోటీలు నిర్వహించింది. భూగ్రహాన్ని కాపాడుకోవడం మానవాళి శ్రేయస్సుకి కీలకమని సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిలో అయిదు రాష్ట్రాలవ్యాప్తంగా ఓపెన్‌ ఫర్‌ ది ప్లానెట్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడించింది.

ఇందులో 8,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొంది. మొక్కలు నాటడం, క్లీన్‌–అ–థాన్‌ కార్యక్రమాలు, కొత్త తరం గ్రీన్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ కోసం ఈవీ డిస్‌ప్లే జోన్ల ఏర్పాటు మొదలైనవి చేసినట్లు వివరించింది. కార్యకలాపాలు, వ్యవసాయ వాల్యూ చెయిన్స్‌వ్యాప్తంగా వాతావరణంపరమైన రిసు్కలను మదింపు చేసేందుకు కృత్రిమ మేథను ఉపయోగిస్తున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ వెల్లడించింది. తద్వారా ఆయా సందర్భాలకు అనువైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అటు, క్లైమేట్‌ యాక్షన్, లో-కార్బన్‌ మొబిలిటీపై వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ ప్రత్యేక సదస్సు నిర్వహించింది.

పర్యావరణహిత మొబిలిటీ దిశగా భారత్‌ గణనీయంగా పురోగతి సాధించినట్లు సియామ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ కె. బెనర్జీ తెలిపారు. వనరులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, స్వచ్ఛ టెక్నాలజీలను వేగవంతంగా వినియోగించుకోవడం తదితర చర్యలతో భారత్‌ నిర్దేశించుకున్న తటస్థ స్థాయి ఉద్గారాల లక్ష్య సాధనకు తోడ్పడుతున్నట్లు సిమెంటు తయారీ సంస్థల అసోసియేషన్‌ సీఎంఏ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement