కార్డీలియా క్రూయిజెస్‌ ఐపీవో బాట... | Cordelia Cruises IPO operator files DRHP | Sakshi
Sakshi News home page

IPO: కార్డీలియా క్రూయిజెస్‌ ఐపీవో బాట...

Jun 17 2025 8:19 PM | Updated on Jun 17 2025 8:34 PM

Cordelia Cruises IPO operator files DRHP

సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు

త్వరలో ఆగ్నేయాసియాకు సర్వీసులు

మరో రెండు షిప్పులు జత..

న్యూఢిల్లీ: లగ్జరీ క్రూయిజ్‌ల నిర్వాహక కంపెనీ వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజం పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 727 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో దాదాపు రూ. 553 కోట్లను డిపాజిట్‌ లేదా అడ్వాన్స్‌డ్‌ లీజ్‌ రెంటల్‌కు చెల్లించనుంది. అనుబంధ సంస్థ బేక్రూయిజ్‌ షిప్పింగ్‌ అండ్‌ లీజింగ్‌(ఐఎఫ్‌ఎస్‌సీ) ప్రయివేట్‌ లిమిటెడ్‌కు నెలవారీ లీజు చెల్లింపులకు సైతం వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

కార్డీలియా క్రూయిజెస్‌ బ్రాండుతో ప్రస్తుతం వాటర్‌వేస్‌ లీజర్‌ ఎంవీ ఎంప్రెస్‌ క్రూయిజ్‌ వెస్సల్‌ను నిర్వహిస్తోంది. నార్వేజియన్‌ స్కై, నార్వేజియన్‌ సన్‌ అనే మరో రెండు క్రూయిజ్‌ల నిర్వహణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. ఒక్కో క్రూయిజ్‌ షిప్‌ ద్వారా సుమారు 2,000 మంది అతిథులకు సేవలు అందించనుంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహిస్తున్న ఎంప్రెస్‌ క్రూయిజ్‌ ప్రధానంగా ముంబై, గోవా, కొచ్చి, చెన్నై, లక్షద్వీప్, విశాఖపట్టణం, పుదుచ్చేరిలకు సేవలందిస్తోంది.

శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నాకు సైతం సర్వీసులు నిర్వహించడంతోపాటు.. ఇటీవలే ఆగ్నేయాసియాకు కూడా సేవలు విస్తరించింది. తొలిసారి ఫుకెట్‌ (థాయ్‌లాండ్‌), సింగపూర్, కౌలాలంపూర్‌ (మలేసియా) తదితర ప్రాంతాలకూ జూలైలో సర్వీసులను మొదలు పెడుతోంది. 2024 డిసెంబర్‌31తో ముగిసిన తొలి 9 నెలల్లో రూ. 409 కోట్ల ఆదాయం, రూ. 139 కోట్ల నికర లాభం ఆర్జించింది.

చ‌ద‌వండి: అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడంతో..   

Advertisement
 
Advertisement
Advertisement