అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడంతో.. | Why Indian Mechandise exports decline in May | Sakshi
Sakshi News home page

మే నెలలో స్వల్పంగా త‌గ్గిన‌ వస్తు ఎగుమతులు

Jun 17 2025 2:17 PM | Updated on Jun 17 2025 3:38 PM

Why Indian Mechandise exports decline in May

ఎగుమతులు రూ.3.29 లక్షల కోట్లు

మే నెలలో 2 శాతం క్షీణత

ఇంతే మేర తగ్గిన దిగుమతులు

రూ.5.15 లక్షల కోట్లుగా నమోద

సేవల ఎగుమతులు సానుకూలం

న్యూఢిల్లీ: వరుసగా రెండు నెలల పాటు సానుకూల వృద్ధిని నమోదు చేసిన వస్తు ఎగుమతులు మే నెలలో స్వల్పంగా క్షీణించాయి. మొత్తం 38.73 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు (రూ.3.29 లక్షల కోట్లు) నమోదయ్యాయి. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడమే ఎగుమతుల విలువ తగ్గడానికి దారితీసినట్టు తెలుస్తోంది. మే నెలలో వాణిజ్య లోటు 21.88 బిలియన్‌ డాలర్లకు (రూ.1.86 లక్షల కోట్లు) పరిమితమైంది. ఇక మే నెలలో వస్తు దిగుమతులు (Imports) సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 1.7 శాతం తగ్గి 60.61 బిలియన్‌ డాలర్లుగా (రూ.5.15 లక్షల కోట్లు) ఉన్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది. బంగారం, ముడి చమురు దిగుమతులు క్షీణించడం మొత్తం మీద దిగుమతులు తగ్గేందుకు సానుకూలించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు (ఏప్రిల్‌–మే) కలిపి చూస్తే వస్తు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల కంటే 3.11 శాతం అధికంగా 77.19 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో దిగుమతులు సైతం 8 శాతం పెరిగి 125.52 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 48.33 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరగడం, ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు ఎగుమతులు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. తాజాగా ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం ఎగుమతుల పరంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్న దానిపై కేంద్ర వాణిజ్య శాఖ ఈ వారంలోనే అంతర్‌ మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించనుంది.  

సేవల ఎగుమతులు జూమ్‌ 
మే నెలో సేవల ఎగుమతులు 33 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. 2024 మే నెలలో ఇవి 29.61 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. సేవల దిగుతులు సైతం మే నెలలో 17.14 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 16.88 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

సవాళ్ల మధ్య మెరుగైన పనితీరు 
అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతుల పరంగా భారత్‌ మెరుగైన పనితీరు చూపించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భత్వాల్‌ తెలిపారు. వాణిజ్యానికి సంబంధించి విధానపరమైన అనిశ్చితులు, పలు దేశాల మధ్య ఘర్షణలను ప్రస్తావించారు. బ్రిటన్, ఈయూ, యూఎస్‌లతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దిశగా వాణిజ్య శాఖ చురుగ్గా పనిచేస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను ఎగుమతిదారులు సర్దుబాటు చేసుకుంటున్నట్టు భారత ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హాన్‌ పేర్కొన్నారు. 

ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు రయ్‌.. 
బియ్యం, ఐరన్‌ఓర్, రత్నాభరణాలు, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్‌ ఉత్పత్తులు దిగుమతులు క్షీణించడానికి దారితీశాయి. 
ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మే నెలలో 30 శాతం తగ్గి 5.6 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.  
ముడి చమురు దిగుమతులు 26 శాతం తగ్గి 14.75 బిలియన్‌ డాలర్లు, బంగారం దిగుమతులు 12.6 శాతం తగ్గి 2.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  
తేయాకు, కాఫీ, దినుసులు, రెడీమేడ్‌ వ్రస్తాలు, కెమికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు సానుకూలంగా నమోదయ్యాయి. 
ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ఎగుమతులు 54 శాతం పెరిగి 45.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

చ‌ద‌వండి: జీవితంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా.. ప్రధాని మోదీకి థ్యాంక్స్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement