జంతు సంరక్షణకు భారతదేశం చూపుతున్న నిబద్ధతపై ఐరాస సంస్థ సైట్స్ (CITES) ప్రశంసల వర్షం కురిపించింది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) పరిధిలో పనిచేస్తున్న ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో, వంతారా కాంప్లెక్స్‌లోని గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), రాధా కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT) వంటి కేంద్రాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్నాయని పేర్కొంది.
ఈ నివేదికను రూపొందించడానికి సైట్స్ బృందం భారత్‌లో విస్తృత పరిశీలన జరిపి, రాబోయే 79వ సైట్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం సమగ్ర రిపోర్ట్ సిద్ధం చేసింది. ఈ సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరగనుంది.
సైట్స్ తన నివేదికలో వంతారా సౌకర్యాలను విశేషంగా ప్రశంసిస్తూ, అక్కడి పశువైద్య సేవలు, వసతులు ప్రపంచ స్థాయి నాణ్యత కలిగినవని పేర్కొంది. "ఈ కేంద్రాలు Appendix-I జాబితాలో ఉన్న జంతువులను కూడా సురక్షితంగా సంరక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని మాకు ఎటువంటి సందేహం లేదు" అని తెలిపింది.
అంతేకాకుండా.. వంతారా సంస్థలు అభివృద్ధి చేసిన అధునాతన వైద్య పద్ధతులు, జంతు చికిత్సా విధానాలు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా ఉన్నాయని సైట్స్ తెలిపింది. ఈ విజయాలను శాస్త్రీయ సమాజంతో పంచుకోవాలని కూడా ప్రోత్సహించింది. ఈ కేంద్రాలు పూర్తిగా చట్టపరమైన, నైతిక ప్రమాణాలతోనే పనిచేస్తున్నాయని సైట్స్ మిషన్ కీలకంగా ప్రస్తావించిన అంశం.
భారత్‌కు అక్రమంగా జంతువులను దిగుమతి చేశారనే ఆధారాలు ఏవీ లేవని నివేదిక స్పష్టం చేసింది. జంతువుల విక్రయం లేదా వాటి సంతానోత్పత్తితో సంబంధం ఉన్న వాణిజ్య కార్యకలాపాలు లేవని తెలిపింది. వాణిజ్య ప్రయోజనాల కోసం దిగుమతులు జరగలేదని స్పష్టంగా పేర్కొంది. వీటి ప్రధాన ఉద్దేశ్యం సంరక్షణ, జాతి పునరుద్ధరణ మాత్రమేనని, భవిష్యత్తులో అడవుల్లో తిరిగి వదిలేలా వీటిని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ నిర్వాహకులు వివరించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
