రోడ్డెక్కనున్న 5,595 ఎలక్ట్రిక్‌ బస్‌లు

Centre Govt approves 5595 electric buses under FAME scheme - Sakshi

ఫేమ్‌ వివరాలను వెల్లడించిన కేంద్రం

ఏపీకి 350, తెలంగాణకు 325 బస్‌లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  దేశవ్యాప్తంగా మరో 5,595 ఎలక్ట్రిక్‌ బస్‌లు రోడ్డెక్కనున్నాయి. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ ఈ మేరకు ఫేమ్‌ ఇండియా స్కీం ఫేజ్‌–2 కింద ఆమోదం తెలిపింది. 64 నగరాల్లో ఇవి కొద్ది రోజుల్లో పరుగెత్తనున్నాయి. 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, స్మార్ట్‌ సిటీస్, రాజధాని నగరాలు, స్పెషల్‌ కేటగిరీ స్టేట్స్‌లోని నగరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు ఆసక్తి వ్యక్తీకరణను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ కోరింది.

26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 14,988 ఎలక్ట్రిక్‌ బస్‌ల కోసం 86 ప్రతిపాదనలు చేశాయి. వీటిని పరిశీలించిన ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్, సాంక్షనింగ్‌ కమిటీ చేసిన సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం 5,595 బస్‌లను మంజూరు చేసింది. ఇందులో 5,095 బస్‌లు నగరాల్లో (ఇంట్రాసిటీ) నడిపేందుకు నిర్దేశించారు. నగరాల మధ్య (ఇంటర్‌సిటీ) కార్యకలాపాలు సాగించేందుకు మరో 400 బస్‌లు, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ కోసం 100 బస్‌లను ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు కేటాయించారు. కాంట్రాక్టు కాలంలో అన్ని బస్‌లు 400 కోట్ల కిలోమీటర్లు తిరగనున్నాయి. 120 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.  

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఫేజ్‌–2 కింద ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌  మొత్తం 350 ఎలక్ట్రిక్‌ బస్‌లను   చేజిక్కించుకుంది. ఇందులో విశాఖపట్నం 100, విజయవాడ 50, అమరావతి 50, తిరుపతి 50, కాకినాడ 50 బస్‌లను దక్కించుకున్నాయి. అలాగే నగరాల మధ్య ప్రజా రవాణాకు 50 బస్‌లను కేటాయించారు. తెలంగాణలో హైదరాబాద్‌కు 300, వరంగల్‌కు 25 బస్‌లు అలాట్‌ అయ్యాయి. కాగా, ఫేజ్‌–2లో నాలుగు రాష్ట్రాల్లో లోయెస్ట్‌ బిడ్డర్‌గా హైదరాబాద్‌ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నిలిచినట్టు మార్కెట్‌ వర్గాల సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా సంస్థల టెండర్లలో ఈ కంపెనీ పోటీలో ముందున్నట్టు తెలుస్తోంది. 9, 12 మీటర్ల పొడవున్న బస్‌లను ఒలెక్ట్రా తయారు చేస్తోంది. ఇప్పటికే దేశంలో పలు నగరాల్లో 400కుపైగా ఒలెక్ట్రా ఈ–బస్‌లు విజయ వంతంగా పరుగెడుతున్నాయి. బ్యాటరీ మినహా బ స్‌కు కావాల్సిన విడిభాగాలన్నీ దేశీయంగా తయా రు చేస్తోంది. జడ్చర్ల వద్ద సంస్థకు ప్లాంటు ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top