
ఏప్రిల్‌లో 40 శాతం దిగువకు..
రెండో స్థానంలో ఎంఅండ్‌ఎం
ఫాడా గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో కార్ల తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి ఇండియా వాటా ఏప్రిల్‌లో 40 శాతం లోపునకు పడిపోయింది. 1,38,021 వాహన విక్రయాలతో 39.44 శాతానికి పరిమితమైంది. గతేడాది ఏప్రిల్‌లో 1,39,173 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 40.39 శాతం మార్కెట్ వాటా నమోదు చేసింది.
ఆటోమోటివ్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఫాడా విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం భారీ స్థాయిలో ఎస్‌యూవీ విక్రయాలతో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ఏప్రిల్‌లో అత్యధికంగా లబ్ధి పొందింది. నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.
కంపెనీ అమ్మకాలు 38,696 యూనిట్ల నుంచి 48,405 యూనిట్లకు పెరగడంతో.. మార్కెట్ వాటా 11.23 శాతం నుంచి 13.83 శాతానికి పెరిగింది. ఇక సుదీర్ఘకాలంగా రెండో స్థానంలో కొనసాగుతూ వస్తున్న హ్యుందాయ్ మోటార్స్ (హెచ్‌ఎంఐఎల్) 43,642 యూనిట్ల అమ్మకాలు, 12.47 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానానికి పడిపోయింది. టాటా మోటార్స్ 44,065 వాహన విక్రయాలతో మూడో స్థానంలో కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 3,44,594 యూనిట్ల నుంచి 1.55 శాతం వృద్ధితో 3,49,939 యూనిట్లకు చేరాయి.
2024–25 పూర్తి సంవత్సర వివరాలు..
➤గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 16,71,559 యూనిట్ల అమ్మకాలతో మారుతీ సుజుకీ 40.25 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది. 2023–24లో 16,08,041 వాహనాలు విక్రయించగా, మార్కెట్ షేర్ 40.6 శాతంగా నమోదైంది.
➤హెచ్‌ఎంఐఎల్ 5,59,149 యూనిట్లు, 13.46 శాతం మార్కెట్ వాటాతో 2024–25లో మారుతీ తర్వాత రెండో స్థానంలో ఉంది. 2023–24లో 5,62,865 వాహన విక్రయాలు, 14.21 శాతం వాటాను సాధించింది.
ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!
➤టాటా మోటార్స్ 5,35,960 యూనిట్లు విక్రయాలు, 12.9 శాతం వాటాతో మూడో స్థానంలో కొనసాగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 5,39,567 యూనిట్లు కాగా, మార్కెట్ వాటా 13.62 శాతం.
➤5,12,626 యూనిట్ల అమ్మకాలు, 12.34 శాతం మార్కెట్ వాటాతో ఎంఅండ్‌ఎం నాలుగో స్థానంలో నిలి్చంది. 2023–24లో కంపెనీ రిటైల్ అమ్మకాలు 4,27,390 యూనిట్లు కాగా, మార్కెట్ వాటా 10.79 శాతంగా ఉంది.