
బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా.. బిట్‌కాయిన్ విలువ కూడా అమాంతం పెరుగుతూనే ఉంది. మొదటిసారి బిట్‌కాయిన్ విలువ 1,12,000 డాలర్లకు (రూ. 94 లక్షల కంటే ఎక్కువ) చేరింది. ఓవైపు మదుపర్ల నుంచి గిరాకీ.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా దీని విలువ భారీగా పెరుగుతోంది.
బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం.. గురువారం ప్రారంభ ఆసియా ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ 3.3 శాతం పెరిగి 1,11,878 డాలర్లను దాటేసింది. రెండవ స్థానంలో ఉన్న ఈథర్ విలువ కూడా 7.3 శాతం పెరిగింది. అమెరికా సెనేట్‌లో స్టేబుల్‌కాయిన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బిట్‌కాయిన్ విలువ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టోకు అనుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే బిట్‌కాయిన్ వాల్యూ ఆల్ టైమ్ గరిష్టాలకు నెమ్మదిగా కదులుతోందని.. ఫాల్కన్‌ఎక్స్ లిమిటెడ్‌లోని గ్లోబల్ కో-హెడ్ ఆఫ్ మార్కెట్స్ జాషువా లిమ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..
మైఖేల్ సాయిలర్ అనుబంధ సంస్థ ఇప్పటికే.. 50 బిలియన్ డాలర్ల (రూ. 4 లక్షల కోట్ల కంటే ఎక్కువ) విలువైన బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేసింది. అంతే కాకుండా.. కన్వర్టిబుల్ బాండ్స్, ప్రిఫర్డ్ స్టాక్స్ వంటి అనేక కొత్త టెక్ కంపెనీలు కూడా వివిధ మార్గాల్లో బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. రాబోయే రోజుల్లో బిట్‌కాయిన్ విలువ మరింత భారీగా పెరుగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది.