
క్యూ4లో రూ. 11,022 కోట్లు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు జంప్‌చేసి రూ. 11,022 కోట్లను తాకింది. వన్‌టైమ్ పన్ను లబ్ధి, టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపాయి. కొన్ని పన్నుసంబంధిత అంశాలలో రూ. 5,913 కోట్లు అందుకుంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 2,072 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 27% ఎగసి రూ. 47,876 కోట్లను అధిగమించింది.
అంతక్రితం క్యూ4లో రూ. 37,599 కోట్ల టర్నోవర్ సాధించింది. దేశీ(స్టాండెలోన్) ఆదాయం 29% జంప్‌చేసి రూ. 36,735 కోట్లయ్యింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) 17% మెరుగుపడి రూ. 245ను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 209గా నమోదైంది. 66 లక్షల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు జత కలసినట్లు కంపెనీ వైస్‌చైర్మన్, ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. దేశీ యూ జర్ల సంఖ్య 42.4 కోట్లకు చేరింది. 15 దేశాలలో విస్తరించిన కార్యకలాపాల ద్వారా 59 కోట్ల మంది యూజర్లున్నారు. డేటా కస్టమర్ల సంఖ్య 77%కి చేరింది. సగటున నెలకు మొబైల్ డేటా వినియోగం 21% ఎగసి 25.1 జీబీని తాకింది.
పూర్తి ఏడాదికి సైతం
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎయిర్‌టెల్ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 33,556 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 7,467 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా పుంజుకుని రూ. 1,72,985 కోట్లను తాకింది. 2023–24లో రూ. 1,49,982 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. నికర రుణ భారం రూ. 1.94 లక్షల కోట్ల నుంచి రూ. 2.03 లక్షల కోట్లకు పెరిగింది. క్యూ4లో పెట్టుబడి వ్యయాలు రూ. 12,553 కోట్ల నుంచి రూ. 14,401 కోట్లకు ఎగశాయి. అదనంగా 3,300 టవర్లను ఏర్పాటు చేసింది. పూర్తి ఏడాదికి పెట్టుబడి వ్యయాలు రూ. 33,242 కోట్లుగా నమోదయ్యాయి.
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు బీఎస్‌ఈలో 3 శాతం నష్టంతో రూ. 1,821 వద్ద ముగిసింది.