
దేశ ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో తరచూ భాష వివాదాలు రేగుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భిన్న భాషా నేపథ్యాలున్న వారు అక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలవారికి బెంగళూరులో స్థానికుల నుంచి భాషాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ వివాదాల నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ టెక్ ఫౌండర్ తన కంపెనీ కార్యాలయాన్ని పుణెకు తరలించాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు కౌశిక్ ముఖర్జీ అనే ఎంట్రప్రెన్యూర్ ఇటీవల చెలరేగిన భాష వివాదంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. భాష వివాదాలతో కన్నడ మాట్లాడలేని తమ ఉద్యోగులు ఇబ్బందులు పడకూడని, అందుకే బెంగళూరులోని తమ కంపెనీ కార్యాలయాన్ని పుణె తరలించనున్నట్లు తెలిపారు. తమ ఉద్యోగులు లేవనెత్తిన ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, వారి అభిప్రాయాలతో తానూ ఏకీభవిస్తున్నానని చెప్పారు.
‘బెంగళూరులోని మా కార్యాలయాన్ని ఆరు నెలల్లో మూసేసి పుణెకు తరలించాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నా. భాష వివాదాలు ఇలాగే కొనసాగుతుంటే కన్నడ మాట్లాడలేని మా ఉద్యోగులు బాధితులు కావడం నాకు ఇష్టం లేదు. ఈ ఆలోచన ఉద్యోగుల ఆందోళల నుంచే వచ్చింది. వారి అభిప్రాయాలతో నేను ఏకీభవించాను’ అంటూ కౌశిక్ ముఖర్జీ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు.
బెంగళూరులోని చందాపుర ప్రాంతంలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఇటీవల మేనేజర్‌కు, కస్టమర్‌కు మధ్య భాషా వివాదం తలెత్తింది. మేనేజర్ కన్నడలో మాట్లాడేందుకు నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కన్నడ సంఘాలు, రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేశారు. మేనేజర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదంటూ బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వీడియోను షేర్ చేయగా కౌశిక్ ముఖర్జీ దానికి స్పందిస్తూ పోస్ట్ చేశారు.