బ్యాంకింగ్‌ వ్యవస్థ బాగు... బాగు!

Banking system better placed to sustain loan growth: SBI chairman Dinesh Kumar Khara - Sakshi

గతంకన్నా ఎంతో బెటర్‌

అధిక రుణ వృద్ధికి అవకాశం

ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖరా అభిప్రాయం

ముంబై: భారత్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ గతంకంటే ప్రస్తుతం ఎంతో  మెరుగ్గా ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ దినేఖ కుమార్‌ ఖరా తెలిపారు. అలాగే అధిక రుణ వృద్ధిని కొనసాగించే పరిస్థితులు కనబడుతున్నాయని వివరించారు. ఎస్‌బీఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు...

► రుణ అండర్‌రైటింగ్, రిస్క్‌ దృక్పథం పరిస్థితులకు సంబంధించి బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయి.  
► బ్యాంకింగ్‌  రుణ నిర్ణయాల్లో ఇప్పుడు శాస్త్రీయత పెరిగింది. అలాగే బ్యాంకింగ్‌ వద్ద ప్రస్తుతం తగిన మూలధన నిల్వలు ఉన్నాయి.  
► పలు సంవత్సరాలుగా వార్షిక రుణ వృద్ధిని రెండంకెలకు తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడిన బ్యాంకింగ్‌ వ్యవస్థ నవంబర్‌ 4తో ముగిసిన పక్షం రోజుల్లో 17 శాతం రుణ వృద్ధిని సాధించింది.
► గతం తరహాలో కాకుండా, కార్పొరేట్లు కూడా తమ బ్యాలెన్స్‌ షీట్స్‌లో రుణ భారాల సమతౌల్యతను పాటిస్తున్నాయి.  
► బ్యాంకింగ్‌ ఆధారపడే డేటా, రుణ నిర్వహణ, చర్యల వ్యవస్థలో కూడా భారీ మార్పులు వచ్చాయి. దివాలా కోడ్, గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌ నెట్‌వర్క్‌ డేటా, రేటింగ్స్‌ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అందుతున్న గణాంకాలు, క్రెడిట్‌ బ్యూరోల రిపోర్టుల వంటి సానుకూల అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.  
► 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 40 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందన్న అంచనా బ్యాంకింగ్‌సహా అన్ని రంగాలకూ భారీ భరోసాను అందించే అంశం.  
► ఈ కాలంలో మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న డెట్‌ మార్కెట్‌ మరింత పటిష్టం కావాలి.
► భారత్‌ బ్యాంకింగ్, జీఐఎఫ్‌టీ సిటీ తరహా ప్రత్యామ్నాయ యంత్రాంగాలు  రాబోయే కాలంలో భారత్‌ సమగ్ర వృద్ధికి దోహదపడ్డానికి కీలక పాత్ర పోషించాల్సి ఉంది.  

భారీ లాభాలు
ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్‌పీఏ) కట్టడికి  తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్‌) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే  50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయ్యింది.  తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్‌ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది.

వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు  గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్‌బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల
డివిడెండ్‌లను ప్రకటించాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top