
సాధారణంగా నడక (వాకింగ్) జాగింగ్ చాలా ప్రముఖమైన సులభమైన అత్యధిక శాతం మంది అనుసరించే వ్యాయామాలు. ఎక్కడైనా, ఎప్పుడైనా సరే ఎవరి సాయం లేకుండా కూడా చేయగలిగిన ప్రయోజనకరమైన వ్యాయామాలు కావడంతో వీటికి చాలా ప్రాధాన్యత ఉంది అయితే కొందరిలో సందేహాలు ఉన్నాయి. నడక మంచిదా? జాగింగ్ మంచిదా? అసలు ఏది ఎవరు చేయాలి? ఎంత సేపు చేయాలి... వంటి అనుమానాల నివృత్తి కోసం...వైద్యులు చెబుతున్న కొన్ని విషయాలు..
నలతను దూరం చేసే నడక : శరీరంపై తక్కువ ఒత్తిడి, గాయాలకు అవకాశం చాలా తక్కువ. తగినంత, మితమైన వేగంతో చేస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీర్ఘకాలం పాటు నిరంతరంగా చేస్తే ఇది శరీరంలోని కొవ్వు కారక క్యాలరీలు తగ్గించడంలో, సహాయపడుతుంది. సాధారణ వేగంతో నడిస్తే 45 నిమిషాల నడక వల్ల సుమారు 150 నుంచి 250 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇది అన్ని వయస్సుల వారికి, కొన్ని రకాల ఆరోగ్య పరిమితులతో ఉన్న వారికి కూడా అనుకూలం.
జాగ్రత్తలతో...జాగింగ్
పరుగుకీ, నడకకు మధ్యన ఉండేదే జాగింగ్. నిదానంగా చేసే జాగింగ్ వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కనీసం 15 నిమిషాల పాటు చేసే స్లో జాగింగ్ ద్వారా 100 నుంచి 150 క్యాలరీలు ఖర్చు చేయవచ్చు. కాస్త వేగంగా వేయడం వల్ల శరీరం మరిన్ని ఎక్కువ క్యాలరీలు తక్కువ సమయంలో ఖర్చు చేస్తుంది. ఇది గుండె రక్తనాళ వ్యవస్థకు మేలు కలుగు జేసే వ్యాయామం, ఆక్సిజన్ వినియోగాన్ని మెటబాలిజం వేగాన్ని పెంచడంలో కూడా మనకు తోడ్పడుతుంది .
ఏది ఉత్తమం?
ఈ ప్రశ్నకు సమాధానం వ్యక్తిగత లక్ష్యాల మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకునే లక్ష్యం మాత్రమే కలిగి ఉంటే వాకింగ్ సరిపోతుంది. అదే బరువు తగ్గాలి అంతేకాకుండా గుండెకు తగిన వ్యాయామంకావాలి అనుకుంటే బ్రిస్క్ వాక్, జాగింగ్ మేలు చేస్తాయి.
వ్యక్తి శారీరక పరిస్థితులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కాళ్ళు, గాయాలు, గుండె సంబంధమైన సమస్యలు ఉన్నట్లయితే జాగింగ్ కాకుండా నడక బెస్ట్ అని చెప్పాలి. అలాగే 60ఏళ్లు దాటిన మగవాళ్లు, 50 ఏళ్లు దాటిన మహిళలు తమ తమ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని తొలుత నడకతో మాత్రమే ప్రారంభించాలి. ఇతరత్రా ఏ సమస్యలూ రాకపోతే స్లో జాగింగ్‌కు మళ్లవచ్చు. అదే యుక్త వయసు వాళ్లు అయితే జాగింగ్‌ను ఎంచుకోవచ్చు. ఏదేమైనా, నిరంతరంగా కొనసాగించగల వ్యాయామం ఎంచుకోవడం ముఖ్యం. అది 45 నిమిషాలు నడక కావచ్చు, లేక 20 నిమిషాలు జాగింగ్ అయినా సరే. ఎంచుకున్న వ్యాయామాన్ని క్రమబద్ధంగా చేయడం అత్యంత ముఖ్యమైనది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ప్రకారం శరీర క్రియలు సజావుగా జరగాలంటే వారానికి కనీసం 150 నిమిషాల పాటు ‘మోడరేట్ యాక్టివిటీ’ లేదా 75 నిమిషాల ‘విగరస్ యాక్టివిటీ’ చేయడం అవసరం. చురుకుదనం, ఆరోగ్యం వంటివి చాలనుకుంటే నడక తక్కువ సమయంలో ఫిట్‌నెస్ పెంచాలనుకుంటే జాగింగ్ మంచిది.
నోట్ : ఏది ఏమైనా ముందస్తుగా ఆరోగ్య నిపుణులతో సంప్రదించి మీ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వ్యాయామం చేయడం ఉత్తమం.