ఎస్‌బీఐ లాభాలకు యోనో దన్ను | SBI net profit reached a new high of Rs 70,901 crore in FY25 | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ లాభాలకు యోనో దన్ను

May 20 2025 5:07 AM | Updated on May 20 2025 8:01 AM

SBI net profit reached a new high of Rs 70,901 crore in FY25

దీన్ని మరింతగా విస్తరించాలి 

మార్కెటింగ్‌ గురు రాజేంద్ర శ్రీవాస్తవ విశ్లేషణ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ లాభాలకు డిజిటల్‌ విభాగం గణనీయంగా తోడ్పాటు అందిస్తోంది. ఈ విభాగం చిన్నదే అయినప్పటికీ భారీగా ప్రయోజనాలను చేకూర్చుతోందని మార్కెటింగ్‌ గురు, దేశీ ఫిలిప్‌ కోట్లర్‌గా పేరొందిన రాజేంద్ర శ్రీవాస్తవ విశ్లేషించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బీఐ రూ. 70,901 కోట్ల లాభం ప్రకటించింది. నికరలాభంపరంగా గ్లోబల్‌ టాప్‌ 100 కంపెనీల్లో మన దేశం నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీల సరసన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా నిల్చింది. 

ఎస్‌బీఐ ఈ ఘనత సాధించడంలో, 2017లో బ్యాంక్‌ ఆవిష్కరించిన డిజిటల్‌ ప్లాట్‌ఫాం ’యూ ఓన్లీ నీడ్‌ వన్‌’ (యోనో) యాప్‌ కూడా కీలక పాత్ర పోషించిందని శ్రీవాస్తవ తెలిపారు. కానీ దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే యూజర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సేవలు అందించేందుకు లక్షల మంది ఉద్యోగులు, వేల సంఖ్యలో బ్రాంచీలను ఉపయోగించడం కన్నా డిజిటల్‌ విభాగాన్ని ఇంకా సమర్ధవంతంగా వినియోగించుకోవడంపై దృష్టి పెడితే మరింత ప్రయోజనం లభించగలదని తెలిపారు. ‘ఎస్‌బీఐలో దాదాపు 50 కోట్ల ఖాతాలు ఉన్నాయి.

 ప్రపంచంలోనే అత్యధికంగా ఇంత మందికి సేవలందిస్తున్న అగ్రగామి బ్యాంకు. కానీ ఈ ఖాతాదారుల్లో 7.4 కోట్ల మంది మాత్రమే (సుమారు 14 శాతం మంది) యోనో యూజర్లు ఉన్నారు. ఈ చిన్న విభాగమే ఎస్‌బీఐ లాభాలకు దన్నుగా నిలుస్తోంది. తక్కువ మార్జిన్, అధిక సర్వీస్‌ వ్యయాలు ఉండే ఖాతాలు 37 కోట్ల పైగా ఉంటున్నాయి. అందరికీ ఆర్థిక సేవలు అందించాలన్న నినాదం కింద ప్రారంభించిన చాలా మటుకు ఖాతాల్లో బ్యాలెన్సులు తక్కువగా ఉంటున్నాయి. లేదా వినియోగంలోనే ఉండటం లేదు. వీటి వల్ల నిర్వహణ వ్యయాల భారం అధికంగా ఉంటోంది‘ అని శ్రీవాస్తవ వివరించారు.  

యోనోకు మరింత ప్రాధాన్యమివ్వాలి .. 
రికార్డు లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ ఎస్‌బీఐ పీబీ నిష్పత్తి (ప్రైస్‌–టు–బుక్‌) ప్రైవేట్‌ బ్యాంకులతో పోలిస్తే తక్కువగా 1.4 స్థాయిలో ఉందని శ్రీవాస్తవ చెప్పారు. అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (2.8), ఐసీఐసీఐ బ్యాంకుల (3.3) మార్కెట్‌ వేల్యుయేషన్‌ అధిక స్థాయిలో ఉంటోందని వివరించారు. ఇవి డిజిటల్‌ మాధ్యమాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటూ, కార్యకలాపాల వ్యయాల భారాన్ని తక్కువ స్థాయికి పరిమితం చేసుకోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. 

ఆర్థిక పనితీరు కన్నా, వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోలేకపోవడం వల్లే దేశీ మార్కెట్లో పోటీ సంస్థలతో పోలిస్తే ఎస్‌బీఐ పీబీ నిష్పత్తి డిస్కౌంట్లో ఉంటోందని శ్రీవాస్తవ విశ్లేíÙంచారు. ఈ నేపథ్యంలో యోనోను సమర్ధంగా వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్, యూపీఐ, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీలాంటి డిజిటల్‌ మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడి, గ్రామీణ ప్రాంతాల వారు కూడా మొబైల్‌ ఫోన్స్‌ ద్వారా లావాదేవీలు జరుపుతున్న పరిస్థితుల్లో భౌతిక శాఖల విషయంలో బ్యాంకు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ముఖ్యాంశాలు..

→ ఫిన్‌టెక్‌ విప్లవానికి స్పందనగా 2017లో ప్రారంభించిన యోనో ఇప్పుడు ఎస్‌బీఐ వృద్ధి వ్యూహానికి మూలస్తంభంగా మారింది. ప్రైవేట్‌ దిగ్గజాలు, ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లకు దీటుగా 7.4 కోట్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లు ఉన్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు రూ. 3.2 లక్షల కోట్ల రుణాల వితరణకు ఈ ప్లాట్‌ఫాం ఉపయోగపడింది. రోజువారీగా యోనోలో లాగిన్స్‌ 1 కోటి పైగా ఉంటాయి. ప్రస్తుతం ఎస్‌బీఐ సేవింగ్స్‌ అకౌంట్లకు సంబంధించి 65 శాతం లావాదేవీలు దీని ద్వారానే జరుగుతున్నాయి. యోనో కేవలం బ్యాంకింగ్‌కే పరిమితం కాకుండా వివిధ సర్వీసులు అందిస్తోంది. దీని ద్వారా ఖాతాలు తెరవొచ్చు, మ్యుచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయొచ్చు, బీమా పాలసీలు కొనుగోలు చేయొచ్చు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయొచ్చు, రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రభుత్వ సర్వీసులను కూడా పొందవచ్చు.  

→ వ్యయ–ఆదాయ నిష్పత్తి, కస్టమర్లను దక్కించుకునేందుకు చేసే వ్యయాలు, అసెట్స్‌పై రాబడులు తదితర అంశాల విషయంలో డిజిటల్‌ బ్యాంకులు ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్యాంకులకు మించి నిలకడగా రాణిస్తున్నాయి. భారత్‌లో పేటీఎం, ఫోన్‌పే, జీరోధాలాంటి ఫిన్‌టెక్‌ సంస్థలు ఒక్కసారిగా ఎగిశాయి. వాటికి భిన్నంగా ఎస్‌బీఐకి భారీ స్థాయి, విశ్వసనీయత, రెగ్యులేటరీ సంస్థ నుంచి మద్దతులాంటి సానుకూలాంశాలు ఉన్నాయి. ఆర్థిక సమ్మిళితత్వానికే కాకుండా పోటీపడి, రాణించేందుకు కూడా వీటిని బ్యాంకు ఉపయోగించుకోవాలి.  

→ శాఖల నెట్‌వర్క్, ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయకుండానే మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకునే సామర్థ్యం ఎస్‌బీఐకి ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు యాప్‌ను మరింత చేరువ చేసి, యోనో యూజర్లను పెంచుకోవాలి. 

→ కాస్తంత పెట్టుబడులు పెడితే, కస్టమర్లను డిజిటల్‌ యూజర్లుగా మార్చుకోవచ్చు. తద్వారా సేవల వ్యయాలను తగ్గించుకోవచ్చు. పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని శాఖలు, ఏటీఎంలువంటి ఆర్‌వోఐ (పెట్టుబడిపై రాబడి) తక్కువ స్థాయిలో ఉండే భౌతిక మౌలిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని దశలవారీగా తగ్గించుకోవావాలి. అలాగే, నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాలు, లేదా లో–బ్యాలెన్స్‌ ఖాతాలకు సంబంధించి నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవాలి. యోనో ద్వారా మరిన్ని ఉత్పత్తులను విక్రయించవచ్చు. యోనోను అనుబంధ సాధనంగా కాకుండా కస్టమర్లకు చేరువయ్యేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక చోదకంగా 
పరిగణించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement