భారీగా పెరిగిన బంధన్ బ్యాంక్ లాభాలు - పూర్తి వివరాలు | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన బంధన్ బ్యాంక్ లాభాలు - పూర్తి వివరాలు

Published Fri, Feb 9 2024 7:13 PM

Bandhan Bank Q3 Results - Sakshi

బంధన్ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితాల ప్రకారం బ్యాంక్ మొత్తం వ్యాపారం 17 శాతం పెరిగి రూ.2.33 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లలో బ్యాంక్ రిటైల్ వాటా ఇప్పుడు 71 శాతం వద్ద ఉంది.

ఈ త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 26 శాఖలను ప్రారంభించింది. దీంతో భారతదేశం మొత్తం మీద ఉన్న బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల సంఖ్య 6250కు చేరుకుంది. వీటి ద్వారా బ్యాంక్ ఏకంగా 3.26 కోట్ల కంటే ఎక్కువ మందికి సేవలు అందిస్తోంది. బంధన్ బ్యాంక్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 75,000 కంటే ఎక్కువ.

బ్యాంక్ డిపాజిట్ గతంలో కంటే కూడా ఈ త్రైమాసికంతో 15 శాతం పెరిగింది. మొత్తం డిపాజిట్ ఇప్పుడు రూ.1.17 లక్షల కోట్లు కాగా, మొత్తం అడ్వాన్సులు రూ.1.16 లక్షల కోట్లు. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ నిష్పత్తి 36.1 శాతం వద్ద ఉంది.  బ్యాంక్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో 19.8 శాతం వద్ద నిలిచింది. ఇది గతంలో కంటే కూడా చాలా ఎక్కువ కావడం గమనార్హం.

బంధన్ బ్యాంక్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది, తద్వారా SME లోన్స్, గోల్డ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్ వంటి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. వీటితో పాటు బ్యాంక్ ఇటీవల కమర్షియల్ వెహికల్ లెండింగ్, వ్యాపారాల కోసం ఆస్తిపై లోన్ వంటి కొత్త వర్టికల్స్‌ ప్రారంభించింది. ఇవన్నీ రాబోయే రోజుల్లో బ్యాంకు గణనీయమైన వృద్ధికి సహాయపడతాయి.

బంధన్ బ్యాంక్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా, ఎండీ & సీఈఓ చంద్ర శేఖర్ ఘోష్ మాట్లాడుతూ.. మూడవ త్రైమాసికం ఎప్పుడూ బ్యాంకుకు మంచి వృద్ధి తీసుకువస్తుందని, రానున్న రోజుల్లో మరింత వృద్ధిని సాధించడానికి, కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కావలసిన సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటామని, దేశంలో మరింత మందికి చేరువయ్యే దిశగా అడుగులు వేస్తామని అన్నారు.

ఇదీ చదవండి: ప్రశాంతత లేదని ట్వీట్‌.. తెల్లారేసరికి ఉద్యోగమే ఊడింది!

Advertisement
Advertisement