
బెంగళూరు: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) కొత్తగా ఏఐ డ్రివెన్ డెవలప్‌మెంట్ లైఫ్‌సైకిల్ (ఏఐ–డీఎల్‌సీ) మోడల్‌ను ఆవిష్కరించింది. కైరో, అమెజాన్ క్యూ డెవలపర్‌లాంటి టూల్స్‌ను ఉపయోగించి, కృత్రిమ మేథ (ఏఐ)తో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
దీనితో మానవ పర్యవేక్షణలో కోడింగ్, టెస్టింగ్‌లాంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసే వ్యవధిని నెలల నుంచి రోజుల స్థాయిలోకి కుదించవచ్చని సంస్థ తెలిపింది. అలాగే మెరుగైన ఏఐ విధానాలను షేర్ చేసుకునేందుకు ఏఐ–నేటివ్ బిల్డర్స్ కమ్యూనిటీని కూడా ప్రవేశపెట్టినట్లు వివరించింది.
అటు ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్ ద్వారా అంతర్జాతీయంగా 27 లక్షల మంది విద్యార్థులకు, ఉచితంగా ఏఐ ట్రైనింగ్ యాక్సెస్ అందిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్ తెలిపింది. జనరేటివ్ ఏఐని ఉపయోగించి వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించే డెవలపర్లకు 2 మిలియన్ డాలర్ల విలువ చేసే క్రెడిట్స్‌ను ఇచ్చేలా ఏడబ్ల్యూఎస్ ఏఐ లీగ్‌ను కూడా ప్రకటించింది.