ఆటో విడిభాగాల లాభాలు వీక్‌! 

Auto Parts Supplies May Decline Over 70 Percent: ICRA - Sakshi

క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)పై అంచనాలు

నిర్వహణ లాభాలు 70 శాతం డౌన్‌

ఆదాయంలోనూ 30–40 శాతం కోత

పూర్తి ఏడాదికి మాత్రం 20 శాతం అప్‌

రేటింగ్‌ సంస్థ ఇక్రా తాజా నివేదిక 

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆటో విడిభాగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్‌లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనున్నట్లు రేటింగ్‌ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి ఆంక్షలు, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో నిర్వహణ లాభాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. వెరసి క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ లాభాల్లో 70 శాతం కోత పడేవీలున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఇందుకు మరోవైపు వేగంగా పెరిగిన కమోడిటీల ధరలు కారణంకానున్నట్లు తెలియజేసింది. అయితే వీటిని వాహన తయారీ(ఓఈఎం) సంస్థలకు బదిలీ చేసే వీలున్నప్పటికీ ఇందుకు 3–6 నెలల సమయం పడుతుందని వివరించింది.  

ఆంక్షల ఎఫెక్ట్‌ 
ఈ ఏడాది క్యూ1లో  ఆటో విడిభాగాల కంపెనీల మొత్తం ఆదాయాలూ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోనున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే 30–40 శాతం స్థాయిలో టర్నోవర్‌ తగ్గవచ్చని అంచనా వేసింది. ఫలితంగా నిర్వహణ లాభం (ఇబిటా) గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంతో పోలిస్తే 70 శాతం స్థాయిలో క్షీణించవచ్చని అభిప్రాయపడింది. కాగా.. కరోనా ప్రతికూలతల నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు  కొనసాగుతున్నప్పటికీ గత కొద్ది నెలలుగా ఆటో విడిభాగాల పరిశ్రమను ఎగుమతులు ఆదుకుంటున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. దీంతో దేశీ డిమాండుపైనే అధికంగా ఆధారపడే కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలియజేసింది.  

నిల్వలు పెరుగుతున్నాయ్‌ 
స్వల్ప కాలంలో ఆటో విడిభాగాల పరిశ్రమ సవాళ్లను ఎదుర్కోనున్నప్పటికీ పూర్తి ఏడాదిలో పటిష్ట పనితీరు చూపే వీలున్నట్లు పేర్కొంది. ఆదాయంలో సగటున 20–23% పురోగతి నమోదుకాగలదని అంచనా వేసింది. ఆటోమొబైల్‌ రంగంలో పలు విభాగాలలోనూ రెండంకెల వృద్ధికి వీలుండటంతో ఆదాయాలు పుంజుకోగలవని వివరించింది. ఏప్రిల్‌లో ఉత్పత్తిలో నిలకడ కొనసాగినప్పటికీ గత రెండు నెలల్లో రిటైల్‌ విక్రయాలు పడిపోయినట్లు తెలియజేసింది. దీంతో ఆటో రంగ పరిశ్రమలో నిల్వలకు అవకాశం ఏర్పడినట్లు ప్రస్తావించింది.

పలు ఓఈఎంలు జూన్‌ నెలలో ఒకే షిఫ్ట్‌కు పరిమితంకావడంతో ఉత్పత్తి పరిమాణం మందగించనున్నట్లు తెలియజేసింది.  కమోడిటీ ధరలు సైతం ఒత్తిడిని పెంచనున్నట్లు ఇక్రా వివరించింది. ప్రస్తుత ఏడాది తొలి అర్ధభాగంలో ఈ ప్రభావం అధికంగా కనిపించనుందని, అక్టోబర్‌–మార్చి నుంచి ధరలు కొంతమేర బలహీనపడవచ్చని విశ్లేషించింది. ఎలక్ట్రానిక్‌ పరికరాల కొరత, సెమీకండక్టర్‌ ధరల పెరుగుదల సైతం ఆటో పరిశ్రమకు సమస్యలు సృష్టించనున్నట్లు ఇక్రా అభిప్రాయపడింది.  

చదవండి:
అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..!

హ్యుందాయ్‌ కెట్రాలో కొత్త మోడల్‌... తగ్గిన ధర

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top