
క్యూ4లో రూ. 701 కోట్లు
షేరుకి రూ. 20.55 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 701 కోట్లకు పరిమితమైంది. డిమాండ్ తగ్గడంతోపాటు, పోటీ తీవ్రత ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,275 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 8,731 కోట్ల నుంచి రూ. 8,359 కోట్లకు స్వల్పంగా(4 శాతం) వెనకడుగు వేసింది. మొత్తం వ్యయాలు రూ. 7,277 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 20.55 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.
విదేశీ అమ్మకాలు వీక్
క్యూ4లో ఇతర ఆదాయంతో కలిపి ఏషియన్ పెయింట్స్ మొత్తం టర్నోవర్ 5 శాతం తక్కువగా రూ. 8,459 కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు 2 శాతం నీరసించి రూ. 800 కోట్లకు పరిమితమయ్యాయి. ఇథియోపియా, ఈజిప్‌్టలలో కరెన్సీ విలువ క్షీణించడం, బంగ్లాదేశ్‌లో ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణమైనట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు.
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1.3 శాతం బలహీనపడి రూ. 2,303 వద్ద ముగిసింది.