
6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు
ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటన
6.3 శాతానికి తగ్గించిన ఇండ్–రా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ప్రకటించాయి. ఏడీబీ 0.20 శాతం మేర, ఇండ్–రా 0.30 శాతం చొప్పున కోత పెట్టాయి. భారత జీడీపీ 2025–26లో 6.7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఏడీబీ లోగడ అంచనా వేయగా.. తాజాగా దీన్ని 6.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
భారత ఎగుమతులు, పెట్టుబడులపై వాణిజ్య అనిశ్చితులు, అమెరికా టారిఫ్‌లు ప్రభావం చూపించొచ్చని పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని తెలిపింది. ‘‘అమెరికా కనీస టారిఫ్‌లు, సంబంధిత విధానపరమైన అనిశ్చితి వల్లే వృద్ధి అంచనాను సవరించాం. దీనికి అదనంగా అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నిదానించడం, భారత ఎగుమతులపై అమెరికా అదనపు టారిఫ్‌లు, విధానపరమైన అనిశ్చితులు పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తాయి’’అని ఏడీబీ పేర్కొంది.
దేశీ ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయంటూ.. గ్రామీణ డిమాండ్ పుంజుకోవడంతో దేశీ వినియోగం బలంగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. భారత వృద్ధిని ప్రధానంగా వ్యవసాయం, సేవల రంగాలు నడిపిస్తాయని తెలిపింది. సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలు వ్యవసాయ రంగం పనితీరుకు మద్దతుగా నిలుస్తాయని వివరించింది. 2025–26 సంవత్సరంలో జీడీపీ 6.3–6.8 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే పేర్కొనగా, 6.5 శాతంగా ఉంటుందన్నది ఆర్‌బీఐ అంచనాగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందడం గమనార్హం.
2026–27లో 6.7 శాతం..
భారత ప్రభుత్వ ద్రవ్య పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని, అంచనాలకు మించి ఆర్‌బీఐ డివిడెండ్ రావడంతో ద్రవ్యలోటును క్రమంగా తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఉన్నట్టు ఏడీబీ తెలిపింది. 2026–27లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని చేరుకోవచ్చని అంచనా వేసింది. సానుకూల ఆర్థిక పరిస్థితులు, విధానపరమైన అనిశ్చితి తగ్గుముఖం పట్టడం, పెట్టుబడుల్లో వృద్ధి, ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు అనుకూలించొచ్చని పేర్కొంది. చమురు ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం కూడా భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలిస్తుందని అభిప్రాయపడింది.
6.3 శాతానికి పరిమితం కావొచ్చు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ది 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఇండ్–రా అంచనా వేసింది. 2024 డిసెంబర్ అంచనాల్లో పేర్కొన్న 6.6%తో పోల్చి చూస్తే 0.30% తగ్గించింది. అమెరికా టారిఫ్‌ల పరంగా అనిశ్చితులు నెలకొనడంతోపాటు, పెట్టుబడుల వాతావరణం బలహీనంగా ఉండడాన్ని ప్రస్తావించింది. అన్ని దేశాలపై టారిఫ్‌లను అమెరికా ఏకపక్షంగా పెంచేయడం, పెట్టుబడుల వాతావరణం అంచనాలకు మించి బలహీనంగా ఉండడాన్ని ప్రతికూలతలుగా పేర్కొంది. పరపతి విధానం సరళీకరించడం (రెపో రేట్ల కోత), ద్రవ్యోల్బణం వేగంగా తగ్గుముఖం పట్టడం, సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలను అనుకూలతలుగా ఇండ్–రా ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 3% స్థాయిలో, డాలర్‌తో రూపాయి మారకం 86.9% స్థాయిలో ఉండొచ్చని ఇండ్–రా అంచనా వేసింది.