EV Buses In Tirupati: ఏపీఎస్‌ఆర్‌టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్‌

APSRTC Ordered 100 EV Buses to Olectra To Operate Around Tirupati - Sakshi

ఏపీఎస్‌ఆర్‌టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్‌

కాంట్రాక్టు విలువ రూ. 140 కోట్లు

హెదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తిరుమల గిరుల్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా తిరుమల - తిరుపతిల మధ్య ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపించాలని నిర్ణయించింది.

ఏపీఎస్‌ఆర్టీసీ ఒప్పందం
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) నుంచి 100 ఎలక్ట్రిక్‌ బస్సులకు ఆర్డరు దక్కించుకుంది. ఫేమ్‌–2 స్కీము కింద ఇందుకు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ అవార్డును ఒలెక్ట్రా అనుబంధ సంస్థ ఈవీ ట్రాన్స్‌కు ఏపీఎస్‌ఆర్‌టీసీ జారీ చేసింది. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు రూ. 140 కోట్లు. 12 నెలల కాలంలో బస్సులను డెలివరీ చేయాలి.

Electric Buses In Tirumala Tirupati

తిరుపతి కేంద్రంగా
కాంట్రాక్టు వ్యవధిలో బస్సుల మెయింటెనెన్స్‌ను ఒలెక్ట్రా నిర్వహిస్తుంది. నిర్దిష్ట మోడల్‌ ప్రకారం ఈ కాంట్రాక్టు 12 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. ఈ బస్సులను తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి నిర్వహిస్తారు. 50 బస్సులను తిరుమల–తిరుపతి ఘాట్‌ రోడ్డులో, మరో 50 బస్సులను తిరుపతి నుంచి నెల్లూరు, కడప, మదనపల్లి పట్టణాలకు ఇంటర్‌సిటీ సర్వీసులుగా నడుపుతారు. కొత్త ఆర్డర్‌తో కంపెనీ ఆర్డర్‌ బుక్‌ సుమారు 1,450 బస్సులకు చేరింది.

కాలుష్యం తగ్గిపోతుంది
 ‘సమర్థమంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలకు ఒలెక్ట్రా కట్టుబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్‌ బస్సులు ఆపరేట్‌ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్, ముంబై, పుణె తదితర నగరాల్లో మా బస్సులు నడుస్తున్నాయి‘ అని ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ చైర్మన్‌ కేవీ ప్రదీప్‌ తెలిపారు.

మేఘా గ్రూపు నుంచి
ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ భాగంగా ఉంది. మరోవైపు, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణలోని షాబాద్‌ మండలంలోని పారిశ్రామిక పార్కులో 150 ఎకరాల స్థలాన్ని టీఎస్‌ఐఐసీ కేటాయించినట్లు స్టాక్‌ ఎక్సేంజీలకు ఒలెక్ట్రా తెలిపింది. 
బస్సు ప్రత్యేకతలు.. 
ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ కండీషన్డ్‌ బస్సుల్లో డ్రైవర్‌ కాకుండా 35 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. లిథియం అయాన్‌ బ్యాటరీలతో పని చేసే ఈ బస్సులు ఒక్కసారి చార్జి చేస్తే ట్రాఫిక్, ప్రయాణికుల సంఖ్యను బట్టి దాదాపు 180 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తాయి.
 

చదవండి:ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top