ఇక సహకార జీవిత బీమా సంస్థ | Amit Shah Cooperative Life Insurance Company Bharat Taxi Expand 500 Cities | Sakshi
Sakshi News home page

ఇక సహకార జీవిత బీమా సంస్థ

Jul 7 2026 1:09 AM | Updated on Jul 7 2026 1:49 AM

Amit Shah Cooperative Life Insurance Company Bharat Taxi Expand 500 Cities

    500 నగరాలకు భారత్‌ ట్యాక్సీ సేవలు

    కేంద్ర మంత్రి అమిత్‌ షా వెల్లడి

న్యూఢిల్లీ: సహకార రంగంలో జీవిత బీమా కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. బీమా రంగంలో కూడా సహకార సంస్థలు వృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఎరువులకు సంబంధించిన కోఆపరేటివ్‌ ఇఫ్కో ఇప్పటికే జాయింట్‌ వెంచర్‌ (ఇఫ్కో–టోకియో) ద్వారా బీమా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని సహకార శాఖ ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 26 జీవిత బీమా సంస్థలు ఉన్నాయి.

మరోవైపు, కోఆపరేటివ్‌ మోడల్‌గా ప్రవేశపెక్టిన భారత్‌ ట్యాక్సీ సేవలను వచ్చే రెండేళ్లలో 500 నగరాలకు విస్తరించనున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఢిల్లీ, లక్నో, చండీగఢ్, ముంబై తదితర నగరాల్లో ఇవి అందుబాటులో ఉండగా.. త్వరలో రాంచీ, పాట్నా, భోపాల్‌ మొదలైన నగరాల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు షా చెప్పారు. భారత్‌లో 30 కోట్ల మంది పైగా సభ్యులతో 8.5 లక్షల పైచిలుకు సహకార సంఘాలు ఉన్నాయి.  కోఆపరేటివ్‌ రంగంలో మానవ వనరుల సమస్యను పరిష్కరించేందుకు గుజరాత్‌లోని ఆనంద్‌లో ఏర్పాటు చేస్తున్న త్రిభువన్‌ సహకారి యూనివర్సిటీ తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. బ్యాంకింగ్, డెయిరీ, మార్కెటింగ్‌ తదితర విభాగాల్లో ఈ వర్సిటీ నిపుణులను తయారు చేస్తుందని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement