అంతర్జాతీయ పెట్టుబడులకు ద్వారాలు

AMCs open subscription for international schemes - Sakshi

చందాలు స్వీకరిస్తున్న మ్యూచువల్‌ ఫండ్స్‌

సెబీ విధించిన పరిమితి వరకే

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ ఫండ్స్‌కు సంబంధించి తాజా పెట్టుబడులను పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు అనుమతిస్తున్నాయి. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్, మిరే అస్సెట్‌ మ్యూచువల్‌ ఫండ్, ఎడెల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇలా అనుమతించిన వాటిల్లో ఉన్నాయి. ఎడెల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఏడు అంతర్జాతీయ పథకాలను నిర్వహిస్తుండగా, అన్నింటిలోకి చందాలను సోమవారం నుంచి స్వీకరిస్తోంది.

స్విచ్‌ ఇన్‌ లేదా లంప్‌సమ్‌ లావాదేవీలను అనుమతిస్తోంది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌పై పన్ను ప్రయోజనాలు ఏప్రిల్‌ 1 నుంచి మారిపోతున్నాయి. దీంతో మార్చి 31లోపు ప్రస్తుత పన్ను ప్రయోజనం నుంచి లబ్ధి పొందాలనుకునే వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించినట్టు ఎడెల్‌వీజ్‌ ఏఎంసీ ప్రొడక్ట్‌ హెడ్‌ నిరంజన్‌ అవస్థి తెలిపారు. ఇక మిరే అస్సెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మూడు ఇంటర్నేషనల్‌ ఈటీఎఫ్‌లు, వీటికి సంబంధించిన ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ల్లోకి లంప్‌సమ్‌ పెట్టబడులను మార్చి 27 నుంచి అనుమతిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుత సిప్‌లు, సిస్టమ్యాటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (ఎస్‌టీపీ)లను సైతం మార్చి 29 నుంచి తెరుస్తున్నట్టు.. తాజా సిప్‌లు, ఎస్‌టీపీలను మాత్రం అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మూడు విదేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి లంప్‌సమ్‌ పెట్టుబడులను అనుమతిస్తోంది.   

పరిమితులు..
‘‘తాజా పెట్టుబడుల స్వీకరణకు సంబంధించి పరిమితులు ఉన్నాయి. సెబీ విదేశీ పెట్టుబడుల పరిమితులకు అనుగుణంగా ఈ పథకాల్లో తిరిగి భవిష్యత్తులోనూ పెట్టుబడులను నిలిపివేయవచ్చు’’ అని మిరే అస్సెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఈటీఎఫ్‌ హెడ్‌ సిద్ధార్థ శ్రీవాస్తవ తెలిపారు. విదేశీ స్టాక్స్‌లో దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ 7 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సెబీ పరిమితి విధించింది. గతేడాది జనవరి నాటికి ఫండ్స్‌ మొత్తం పెట్టుబడులు ఈ పరిమితికి చేరడంతో తాజా పెట్టుబడులు స్వీకరించొద్దని ఆదేశించింది. 2022 జూన్‌లో తాజా పెట్టుబడులకు మళ్లీ అనుమతించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top