
మనకు ఏ అంశంపైన ఆసక్తి ఉందో.. ఏ పనినైతే మనం ఇష్టంగా చేయగలుగుతామో దాన్నే కెరియర్‌గా ఎంచుకుంటే ప్రతిఒక్కరూ తప్పకుండా విజయవంతం అవుతారు. దీనికి ఉదాహరణే ఈ 23 వేళ్ల ఇండియన్-అమెరికన్ కుర్రాడు మనోజ్ తుము. ప్రస్తుతం ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటాలో 4 లక్షల డాలర్ల (రూ.3.36 కోట్లు) జీతంతో ఉద్యోగం చేస్తున్న తాను.. ఈ జాబ్‌ను గతంలో అమెజాన్‌లో పనిచేస్తున్నప్పుడు ఎలా పొందిందీ వివరించాడు.. తనలాగే ముందుకెళ్లాలనుకుంటున్నవారికి సూచనలూ ఇచ్చాడు.
బిజినెస్ ఇన్‌సైడర్ కోసం రాసిన వ్యాసంలో మనోజ్ తుము పోటీ నియామక ప్రక్రియను ఎలా ఎదుర్కొన్నాడో, తన కెరీర్ మార్గాన్ని తీర్చిదిద్దిన పాఠాల గురించి వివరించాడు. హైస్కూల్ క్రెడిట్స్ కారణంగా ఏడాదిలోనే అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మనోజ్ ఫుల్ టైమ్ పనిచేస్తూనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాస్టర్స్ చేశారు. మరింత ఉత్తేజకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం మెటాకు మారడానికి ముందు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా 9 నెలల పాటు అమెజాన్‌లో పనిచేశారు.
ఏఐలో ప్రవేశించాలంటే..
మనోజ్ ప్రకారం.. మెషిన్ లెర్నింగ్ టైటిల్స్ మారుతూ ఉంటాయి. రిసెర్చ్ సైంటిస్ట్, అప్లైడ్ సైంటిస్ట్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తదితర పాత్రలు పోషించవచ్చు. క్లాసికల్ ఎంఎల్ నుంచి డీప్ లెర్నింగ్ కు మారడం ఈ రంగాన్ని మరింత డైనమిక్ గా, కాంపిటీటివ్ గా మార్చింది. కళాశాల ఇంటర్న్ షిప్ లు తక్కువ వేతనంతో కూడినవి అయినీ అనుభవం పొందడానికి, నిలదొక్కుకోవడానికి చాలా కీలకం.
రెజ్యూమె & ఇంటర్వ్యూ చిట్కాలు
రెజ్యూమెలో మీరు చేసిన ప్రాజెక్టుల గురించి పేర్కొనడం ఉపయోగకరమే కానీ మీకు రియల్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మీ రెజ్యూమ్ పై ప్రాజెక్ట్‌లు ఆధిపత్యం చెలాయించకూడదని కొత్తగా జాబ్ మార్కెట్‌లోకి వస్తున్నవారికి సూచిస్తున్నారు మనోజ్. బిహేవియరల్ ఇంటర్వ్యూలు కీలకమని, కానీ చాలా మంది అభ్యర్థులు దీన్న విస్మరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక వేతనాల విషయానికి వస్తే సంబంధిత అనుభవాన్ని పెంచుకోవడానికి మనోజ్ ప్రారంభంలో సంప్రదాయ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ కంటే తక్కువ వేతనంతో కూడిన ఎంఎల్ ఉద్యోగాన్నే ఎంచుకున్నాడు. ఇది తరువాత అధిక వేతన అవకాశాలకు దారితీసింది.