అమెజాన్‌.. జెఫ్‌ బెజోస్‌ సరికొత్త రికార్డ్‌

Amazon Jeff Bezos net worth crosses 200 billion dollars - Sakshi

205 బిలియన్‌ డాలర్లకు వ్యక్తిగత సంపద

ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా రికార్డ్‌

రెండో ర్యాంకులోని బిల్‌ గేట్స్ సంపద 116 బిలియన్‌ డాలర్లే

2020లో ఇప్పటివరకూ 80 శాతం దూసుకెళ్లిన అమెజాన్‌ షేరు

గ్లోబల్‌ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇప్పటికే ప్రపంచ కుబేరుల్లో తొలి స్థానంలో నిలుస్తున్న బెజోస్‌ వ్యక్తిగత సంపద బుధవారానికల్లా 200 బిలియన్‌ డాలర్లను దాటింది. తద్వారా తొలిసారి 200 బిలియన్‌ డాలర్ల వ్యక్తిగత సంపదను సాధించిన రికార్డును బెజోస్‌ సొంతం చేసుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో ద్వితీయ ర్యాంకులో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ సంపద 116.1 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా.. బెజోస్‌ సంపద 204.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. బుధవారం అమెజాన్‌ షేరు దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 3442 డాలర్ల వద్ద ముగిసింది. కాగా.. కోవిడ్‌-19లోనూ అమెజాన్‌ షేరు 2020లో ఇప్పటివరకూ ఏకంగా 80 శాతం దూసుకెళ్లడం విశేషం! దీంతో అమెజాన్‌లో 11 శాతం వాటా కలిగిన కంపెనీ ప్రమోటర్‌ జెఫ్‌ బెజోస్‌ తాజా ఫీట్‌ను సాధించగలిగారు. డాలరుతో రూపాయి మారకపు విలువను 74గా పరిగణిస్తే.. బెజోస్‌ సంపద రూ. 15 లక్షల కోట్లకుపైమాటే!

ప్రస్థానమిలా..
సియాటెల్‌లో ఒక చిన్న గ్యారేజీలో పుస్తకాలను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రారంభమైన ఈకామర్స్‌ కంపెనీ అమెజాన్‌ తదుపరి పలు విభాగాలలో వివిధ రకాల ప్రొడక్టులకూ విస్తరించింది. వెరసి ప్రస్తుతం రిటైల్‌ స్టోర్ల దిగ్గజం వాల్‌మార్ట్‌, తదితరాలకు ధీటైన పోటీనిస్తోంది. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు అమెరికన్‌ దినపత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌, వైమానిక కంపెనీ బ్లూ ఒరిజిన్‌ తదితరాలలో  పెట్టుబడులున్నాయి. కాగా.. ట్రేడింగ్‌ ప్రణాళికలో భాగంగా ఈ ఆగస్ట్‌లో బెజోస్‌ 3.1 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. అయినప్పటికీ 200 బిలియన్‌ డాలర్ల సంపదను అందుకోగలగడం విశేషం! వ్యక్తిగత విషయానికివస్తే.. 2019లో 38 బిలియన్‌ డాలర్లతో భార్య మెకింజీతో చేసుకున్న విడాకుల సెటిల్‌మెంట్‌ అత్యంత ఖరీదైనదిగా నిలిచిన విషయం విదితమే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top