తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు

Amara Raja Batteries signs MoU with Govt. of Telangana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్‌(ఏఆర్‌బీఎల్‌) తెలంగాణ లిథియం–అయాన్‌ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో 16 గిగావాట్‌అవర్‌ (జీడబ్ల్యూహెచ్‌) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్‌ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్‌ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్‌ అసెంబ్లీ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. 

‘లిథియం–అయాన్‌ సెల్‌ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో  పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్‌ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్‌ సీఎండీ జయదేవ్‌ గల్లా ఈ సందర్భంగా తెలిపారు.

ఏపీకి కట్టుబడి ఉన్నాం..
ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్‌ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్‌ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్‌ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top