
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబయిలోని బోరివాలిలో తనకున్న రెండు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లను మొత్తం రూ.6.6 కోట్లకు విక్రయించారు. అందులో ఒక యూనిట్ రూ.5.35 కోట్లకు అమ్ముడుపోగా, మరొకటి రూ.1.25 కోట్లకు అమ్ముడైంది. కన్సల్టెన్సీ, హౌసింగ్ ట్రాన్సాక్షన్స్, మార్టగేజ్ అడ్వైజరీ.. వంటి వంటి పలు రకాల సేవలను అందిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ ఈమేరకు వివరాలు వెల్లడించింది.
స్క్వేర్ యార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం ముంబయిలోని ఒబెరాయ్ స్కై సిటీలోని ఈ రెసిడెన్షియల్ యూనిట్లకు సంబంధించి 2025 మార్చిలో లావాదేవీలు నమోదయ్యాయి. ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం రూ.5.35 కోట్లకు విక్రయించిన అపార్ట్‌మెంట్ వాస్తవానికి నవంబర్ 2017లో రూ.2.82 కోట్లకు కొనుగోలు చేశారు. దాంతో 89 శాతం విలువ జోడించినట్లయింది. ఈ అపార్ట్‌మెంట్ కార్పెట్ ఏరియా 100.34 చదరపు మీటర్లు (1,080 చదరపు అడుగులు). రూ.32.1 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.104.77 కోట్ల నోటీసులు
2017లో రూ.67.19 లక్షలకు కొనుగోలు చేసిన మరో అపార్ట్‌మెంట్‌ను అక్షయ్‌కుమార్ రూ.1.25 కోట్లకు విక్రయించారు. 23.45 చదరపు మీటర్ల (252 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా ఉన్న ఈ అపార్ట్‌మెంట్ లావాదేవీకి రూ.7.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది. స్కై సిటీలో ఉన్న ఈ ప్రాపర్టీని ఒబెరాయ్ రియాల్టీ 25 ఎకరాల్లో అభివృద్ధి చేసింది. ఇది 3 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే+స్టూడియో, డూప్లెక్స్ అపార్ట్‌మెంట్లను అందించే రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా 2024 మేలో ఒబెరాయ్ స్కై సిటీలో కొన్ని ఆస్తులను కొనుగోలు చేశారు.