కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతోంది. విద్య, వైద్యం, పరిశ్రమలు, రవాణా, వినోదం వంటి అనేక రంగాల్లో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే.. ఈ అభివృద్ధి వెనుక సమస్యలు కూడా ఉన్నాయని, ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం (UNU) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఏఐ వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. దాని కోసం అవసరమయ్యే నీరు, విద్యుత్, భూమి వినియోగం భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారవచ్చని యూఎన్‌యూ హెచ్చరించింది. ఏఐ వ్యవస్థలు పనిచేయడానికి భారీ డేటా సెంటర్లు అవసరం. ఈ డేటా సెంటర్లలో వేలాది సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. దీంతో సర్వర్లు అధిక ఉష్ణోగ్రతలకు లోనవుతాయి. అలాంటప్పుడు వీటిని చల్లబరచడానికి భారీ మొత్తంలో నీరు అవసరమవుతుంది.
భారీ నీటి వినియోగం!
యూఎన్‌యూ నివేదిక ప్రకారం.. 2030 నాటికి AI డేటా సెంటర్లు వినియోగించే నీరు, ప్రపంచంలోని 1.3 బిలియన్ మంది ప్రజల ప్రాథమిక గృహ అవసరాలను తీర్చగల స్థాయిలో ఉండవచ్చని అంచనా. ఇది ప్రస్తుతం మొత్తం ఆఫ్రికా ఖండ జనాభాకు సమానం అని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఏఐ గురించి జరిగిన చర్చల్లో కార్బన్ ఉద్గారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ నీటి వినియోగం కూడా అంతే ముఖ్యమైన సమస్యగా మారుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఏఐ మోడళ్లను నడపడానికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలోనూ, సర్వర్ల శీతలీకరణలోనూ భారీ స్థాయిలో నీటి వినియోగం ఉంటుంది.
విద్యుత్ వినియోగం
విద్యుత్ వినియోగం విషయంలో కూడా.. పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 2030 నాటికి AI ఆధారిత డేటా సెంటర్లు ప్రతి సంవత్సరం సుమారు 945 టెరావాట్ గంటల విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా దేశాల వార్షిక విద్యుత్ వినియోగాన్ని కలిపినా వచ్చే మొత్తానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
ఏఐ అనేది కేవలం డిజిటల్ సాంకేతికత మాత్రమే కాదని నివేదిక స్పష్టం చేసింది. దీనికి అత్యాధునిక కంప్యూటర్ చిప్స్, భారీ డేటా సెంటర్లు, శీతలీకరణ వ్యవస్థలు, విద్యుత్ మౌలిక సదుపాయాలు అవసరం. ఇవన్నీ భూమి వనరులపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. డేటా సెంటర్ల నిర్మాణం కోసం విస్తారమైన భూభాగం అవసరమవుతుంది. అదనంగా చిప్‌ల తయారీ ప్రక్రియలో కూడా విలువైన ఖనిజాలు, నీరు, పవర్ పెద్ద మొత్తంలో వినియోగించాల్సి ఉంటుంది.
పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు
అయితే.. ఇక్కడ ఐక్యరాజ్యసమితి ఏఐ అభివృద్ధిని నిలిపివేయాలని సూచించడం లేదు. బదులుగా ప్రభుత్వాలు, టెక్నాలజీ సంస్థలు, వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతోంది. కొత్త ఆవిష్కరణలతో పాటు నీటి వినియోగం, విద్యుత్ అవసరాలు, భూమి వినియోగం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తోంది.
ఏఐ మానవ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ దాని వెనుక దాగి ఉన్న పర్యావరణ వ్యయాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను సాధించడం ప్రపంచ దేశాల ముందున్న ప్రధాన సవాలు. కాబట్టి AI వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే, దాని పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించడం చాలా అవసరం.


