తప్పుదోవ పట్టించే ప్రకటనలు వద్దు

Advertisements should not mislead consumers - Sakshi

ప్రకటనకర్తలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ: వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా తమ ప్రకటనలు ఉండకుండా చూసుకోవాలని తయారీ సంస్థలు, సర్వీస్‌ ప్రొవైడర్లు, ప్రకటనకర్తలు, అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలకు కేంద్రం సూచించింది. ఇటు వ్యాపార, అటు వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని పేర్కొంది. ముంబైలో నిర్వహించిన అడ్వర్టయిజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ ఈ మేరకు సూచనలు చేశారు.

వినియోగదారులకు వెల్లడించాల్సిన కీలక వివరాలను (డిస్‌క్లోజర్‌లు) హ్యాష్‌ట్యాగ్‌లు లేదా లింకుల రూపంలో కాకుండా ప్రకటనల్లోనే ప్రముఖంగా కనిపించేలా జాగ్రత్తలు తీసు కోవాలని పేర్కొన్నారు. వీడియోల్లోనైతే డిస్‌క్లోజర్‌లను ఆడియో, వీడియో ఫార్మాట్లలో చూపాలని, లైవ్‌ స్ట్రీమ్‌లలోనైతే ప్రముఖంగా కనిపించేలా, నిరంతరాయంగా చూపాలని సింగ్‌ చెప్పారు. 50 కోట్ల మంది పైగా సోషల్‌ మీడియా యూజర్లు ఉన్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్రకటనల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం  ఉందన్నారు. తమ విశ్వసనీయతపై ప్రభా వం చూపేలా ప్రకటనకర్తలతో తమకు ఏవైనా లావాదేవీలు ఉంటే ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వాటిని వెల్లడించాలని సింగ్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top