గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ.. ఏకమైన 40 భారతీయ కంపెనీలు! | Sakshi
Sakshi News home page

గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ.. ఏకమైన 40 భారతీయ కంపెనీలు!

Published Fri, Sep 29 2023 4:01 PM

40 Indian Startups Come Together Against Google Play Billing System - Sakshi

Google Play Billing System: టెక్‌ దిగ్గజం గూగుల్‌ (Google)కు వ్యతిరేతికంగా  40 భారతీయ స్టార్టప్‌లు, కంపెనీలు ఏకమయ్యాయి. గూగుల్‌ ప్లే బిల్లింగ్ సిస్టమ్ (GPBS)ను సవాలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇంటర్నెట్ అండ్‌ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) ఆధ్వర్యంలో సామూహికంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

గూగుల్‌కు చెందిన GPBS ప్రకారం.. గూగుల్‌ ప్లేలోని  యాప్‌ కొనుగోళ్లన్నీ తమ చెల్లింపు గేట్‌వే ద్వారానే జరగాలి. ఈ లావాదేవీలపై గూగుల్‌ భారీగా 30 శాతం కమీషన్‌ విధిస్తోంది. అయితే భారత్‌లో GPBSకి బదులుగా యూజర్‌ చాయిస్‌ బిల్లింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇటీవలి తీర్పులో గూగుల్‌ను ఆదేశించింది.

చట్టపరమైన చర్యలు!
మీడియా నివేదికల ప్రకారం.. గూగుల్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ వారి ఆందోళనల తీవ్రతను సూచిస్తూ గూగుల్‌పై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తోంది.  ఈ క్రమంలో​ గూగుల్‌ టాస్క్‌ఫోర్స్ ముందు హాజరై వివరణ ఇస్తుందని భావిస్తున్నారు. ఆసక్తికరంగా ఈ టాస్క్‌ఫోర్స్‌లో గూగుల్‌ కూడా ప్రతినిధి స్థానాన్ని కలిగి ఉందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.

(సీఎఫ్‌వో జతిన్ దలాల్‌: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్‌లో ప్రత్యక్షం!)

ఇక మరో అంశంలో సీసీఐ విధించిన  రూ. 936.44 కోట్ల పెనాల్టీపై గూగుల్‌ అప్పీల్‌ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) నవంబర్ 28న విచారించనున్నట్లు ప్రకటించింది. ప్లే స్టోర్‌ విధానాలకు సంబంధించి దాని ఆధిపత్య మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గూగుల్‌కు సీసీఐ ఈ పెనాల్టీ విధించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement