చేతిలో ఫోన్‌.. చేరని నెట్‌  | 27percent Indian households remain offline despite 95percent mobile penetration | Sakshi
Sakshi News home page

చేతిలో ఫోన్‌.. చేరని నెట్‌ 

Jun 7 2026 5:48 AM | Updated on Jun 7 2026 5:48 AM

27percent Indian households remain offline despite 95percent mobile penetration

95.1% కుటుంబాల వద్ద హ్యాండ్‌సెట్స్‌ 

కానీ ‘ఆఫ్‌లైన్‌’ లోనే 27.5% కుటుంబాలు  

డిజిటల్‌ సేవల్లో అసమానతలు 

ఎన్‌సీఏఈఆర్‌–టీక్యూహెచ్‌ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్‌ విప్లవం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, డిజిటల్‌ అవకాశాలు, సేవలు అందరికీ సమానంగా అందడం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని 95.1% కుటుంబాలకు మొబైల్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే 27.5 శాతం కుటుంబాలకు ఇప్పటికీ ఇంటర్నెట్‌ సదుపాయం లేవు. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌), ది క్వాంటమ్‌ హబ్‌ (టీక్యూహెచ్‌) భాగస్వామ్యంతో రూపొందించిన ‘ది ఎవాల్వింగ్‌ ల్యాండ్‌స్కేప్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇన్‌క్లూజన్‌ ఇన్‌ ఇండియా’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2022–24 మధ్య దేశవ్యాప్తంగా 47 వేలకుపైగా కుటుంబాలపై నిర్వహించిన ఇండియా హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సర్వే (ఐహెచ్‌డీఎస్‌–3) ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 

దశాబ్దపు వృద్ధి వెనుక అంతరాలు .. 
భారత్‌లో గత దశాబ్దపు కాలంలో డిజిటల్‌ విస్తరణ గణనీయంగా సాగింది. చౌకైన స్మార్ట్‌ఫోన్లు, తక్కువ ధరకే లభించే డేటా ప్లాన్లు, డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణతో 2015లో కేవలం 19.8 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 2025 నాటికి 103 కోట్లకు పైగా పెరిగింది. అయితే, ఈ అద్భుతమైన వృద్ధి వెనుక అసమానతలు దాగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ నాణ్యత, ప్రజలు వాడుతున్న పరికరాలు (డివైసెస్‌), వారి డిజిటల్‌ నైపుణ్యాలలో వ్యత్యాసాలు ఉన్నాయి. అలాగే విద్య, ఆర్థిక సేవలు, ఉపాధి, ప్రభుత్వ సేవలు, సామాజిక భాగస్వామ్యంలో డిజిటల్‌ సాంకేతికత వినియోగంలో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు వెల్లడించింది  

సదుపాయం కాదు నైపుణ్యాలు కీలకం  
‘‘కేవలం ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉన్నంత మాత్రాన ప్రజలకు డిజిటల్‌ సామర్థ్యం వచ్చేసినట్లు కాదు. డిజిటల్‌ అభివృద్ధి తదుపరి దశలో మౌలిక వసతుల విస్తరణతో పాటు ప్రజల్లో డిజిటల్‌ నైపుణ్యాల పెంపు, ప్రాంతీయ భాషలకు అనుగుణమైన డిజిటల్‌ సేవల రూపకల్పన, లింగ వివక్షను తగ్గించడంపై దృష్టి సారించాలి’’ అని ది క్వాంటమ్‌ హబ్‌ కో–¸ఫౌండర్‌ అపరాజిత భారతి 
తెలిపారు. 

నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు 
→ కుటుంబాల ఆర్థిక స్థితిని బట్టి మొబైల్‌ ఫోన్ల సంఖ్యలో తేడాలు కనిపిస్తున్నాయి. అత్యంత పేద కుటుంబాల్లో సగటున 1.5 మొబైల్‌ ఫోన్లు ఉండగా, సంపన్న కుటుంబాల్లో ఈ సంఖ్య 2.9గా ఉంటోంది.  

→ దేశంలో 71.4 శాతం కుటుంబాలు మొబైల్‌ పరికరాల ద్వారానే ఇంటర్నెట్‌ను వినియోగిస్తుండగా, 27.5 శాతం కుటుంబాలకు ఇప్పటికీ ఎలాంటి ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో లేదు.  డిజిటల్‌ సేవలను వినియోగించడంలో పురుషులు, మహిళల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయి. డిజిటల్‌ సేవల వినియోగంలో పురుషులతో పోలిస్తే మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు. పని చేసే వయసున్న పురుషుల్లో 57.6 శాతం మంది ఇంటర్నెట్‌ వాడుతుండగా, మహిళల్లో ఇది కేవలం 35.6 శాతంగానే నమోదైంది. 

→ డిజిటల్‌ సేవలు వినియోగిస్తున్న ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం (20.4 శాతం) ఆన్‌లైన్‌ అవసరాల కోసం కుటుంబం వెలుపలి వ్యక్తుల సహాయంపై ఆధారపడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అసలు చదువు లేని కుటుంబాల్లో ఈ ఆధారపడే పరిస్థితి దాదాపు 30 శాతంగా ఉంది. అంటే, చాలా మందికి ఇంటర్నెట్‌ అనేది స్వతంత్రంగా వాడుకునే సాధనంగా కాకుండా, ఎవరో ఒకరి మధ్యవర్తిత్వంతో నడిచే సేవగా మిగిలిపోయింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement