
దేశీయంగా 47 శాతం మంది ప్రజలు ఇంకా ఇంటర్నెట్‌కి దూరంగా, ఆఫ్‌లైన్‌లోనే ఉన్నారని గ్లోబల్ టెలికం పరిశ్రమ జీఎస్‌ఎంఏ ఓ నివేదికలో తెలిపింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో పురుషులతో పోలిస్తే మహిళలు 33 శాతం తక్కువగా ఉంటున్నారని వివరించింది.
హ్యాండ్‌సెట్స్ ధర అధికంగా ఉండటం, సాంకేతిక నైపుణ్యాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు కనెక్టివిటీ మధ్య అంతరాలకు కారణమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో పాల్గొన్న సందర్భంగా జీఎస్‌ఎంఏ ఆసియా పసిఫిక్ హెడ్ జులియన్ గోర్మన్ తెలిపారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే సమ్మిళిత వృద్ధికి అవరోధంగా నిల్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దశాబ్దం క్రితం 108 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత డిజిటల్ ఎకానమీ 2023లో మూడు రెట్లు పెరిగి 370 బిలియన్ డాలర్లకు చేరిందని, 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని నివేదిక వివరించింది. అయితే, కీలకమైన ఆవిష్కరణలు, వినియోగం మధ్య అంతరాలను పూడ్చకపోతే ఈ వేగం గతి తప్పే అవకాశం ఉందని, పేర్కొంది.
డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు, మొబైల్ వినియోగాల్లో భారత్ అగ్రగామిగా ఉన్నప్పటికీ, పరిశోధనలు..అభివృద్ధి కార్యకలాపాలపై పెట్టుబడులు పెట్టడం, ప్రైవేట్ రంగంలో ఆవిష్కరణలు, సుశిక్షితులైన నిపుణులను అట్టే పెట్టుకోవడం వంటి విషయాల్లో వెనుకబడి ఉందని నివేదిక తెలిపింది.