
అనుకున్నది సాధించాలనే తపన చాలామందికి ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితులు అందుకు సహకరించకపోవచ్చు. దాంతో కుంగిపోక ఇతర మార్గం ఎంచుకున్నా అందులోనూ ఉన్నతస్థాయికి వెళ్లొచ్చని బెంగళూరుకు చెందిన ఓ యువతి నిరూపించారు. డాక్టర్‌గా స్థిరపడేందుకు రాసే నీట్ పరీక్ష కోసం కేఎస్ రితుపర్ణ ఎంతో కష్టపడ్డారు. కానీ పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఆ పరీక్షలో అర్హత సాధించలేకపోయారు. దాంతో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇంజినీరింగ్‌లో చేరారు.
మంగళూరులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కాలేజీలో చేరారు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, నైపుణ్యాలు పెంచుకున్నారు. దాంతో ఇంజినీరింగ్ ఆరో సెమిస్టర్‌లో ఆమె రోల్స్ రాయిస్‌లో ఎనిమిది నెలల ఇంటర్న్‌షిప్‌ను సాధించారు. తన ప్రతిభను గుర్తించిన కంపెనీ 2024 డిసెంబర్‌లో ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందించింది. రోల్స్ రాయిస్ జెట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్‌లో ఏడాదికి రూ.39.6 లక్షలతో కంపెనీలో చేరారు. చేరిన నాలుగు నెలల్లోనే అంటే ఏప్రిల్ 2025లో తన నైపుణ్యాలను గుర్తించిన కంపెనీ తన వేతనాన్ని రూ.72.3 లక్షలకు పెంచింది.
ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై రూ.68 వేలకోట్ల దావా
‘నేను నీట్‌కు ఎంతో ప్రయత్నించాను. కానీ అర్హత సాధించలేకపోయాను. దాంతో ఇంజినీరింగ్ ఎంచుకున్నాను. రోబోటిక్స్, ఆటోమేషన్ ఇంజినీరింగ్ అంటే ఎంతో ఇష్టం. అంకితభావంతో పనిచేస్తూ, కొత్త విషయాలను నేర్చుకోవడం, నూతన ఆలోచనలను టీమ్‌తో పంచుకోవడం, టెక్నికల్ సమస్యలకు పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించాను’ అని రితుపర్ణ తెలిపారు. రైతులకు సహాయం చేయడానికి కాలేజీలో రోబోను తయారు చేసిన ప్రాజెక్టులో ఆమె పనిచేశారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పతకాలు సాధించారు. ఏడో సెమిస్టర్ పూర్తి చేసుకున్న తర్వాత రోల్స్ రాయిస్ టెక్సాస్ జెట్ ఇంజిన్ విభాగంలో చేరనున్నారు. 20 ఏళ్ల యువతి కంపెనీ జెట్ విభాగంలో అత్యంత పిన్న వయస్కురాలుగా రికార్డులకెక్కనుంది.