డబుల్‌ బెడ్రూం ఫర్‌ సేల్‌! | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూం ఫర్‌ సేల్‌!

Nov 11 2026 12:49 AM | Updated on Nov 11 2026 12:49 AM

రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల చొప్పున విక్రయం

రూ.3వేల అద్దెకు ఇచ్చిన ఇంకొందరు

విచారణ చేసినా పట్టించుకోని అధికారులు

మణుగూరు టౌన్‌: నిరుపేదలు, నిలువ నీడ లేని కుటుంబాలకు గౌరవ ప్రదమైన, సురక్షితమైన శాశ్వత గృహం కేటాయించాలనే సంకల్పంతో ప్రభుత్వం కేటాయించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను విక్రయిస్తున్నారనే ప్రచారం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మణుగూరు మణికంఠనగర్‌లోని 80 డబుల్‌ బెడ్రూం ఇళ్లను 2020–21 సంవత్సరంలో పేదలకు కేటాయించారు. ఇందులో కొన్నింటిని లబ్ధిదారులు విక్రయిస్తుండగా, మరికొందరు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అనర్హులకు దక్కడంతో...

గుడిసెలు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి పక్కా ఇంటి వసతి కల్పించే లక్ష్యంతో మణుగూరు ఉడతానిగుంపులోని మణికంఠనగర్‌లో 80 డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హయాంలో లబ్ధిదారులకు కేటాయించగా, ప్రస్తుతం పలువురు అమ్ముకుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే 30కి పైగా ఇళ్లలో ఇతరులు తిష్టవేశారని సమాచారం. అయితే, లబ్ధిదారుల ఎంపిక సమయాన అనర్హులకు దక్కడం, వారికి గతంలోనే ఇల్లు ఉండడంతో ఇక్కడి డబుల్‌ బెడ్రూం ఇంటిని అద్దెకు ఇచ్చి నెలనెలా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు ప్రభుత్వం మారినందున ఎవరూ పట్టించుకోరనే భావనతో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు విక్రయిస్తూ బాండ్‌ పేపర్లపై రాయించుకున్నట్లు సమాచారం.

ఫిర్యాదులు ఉన్నా.. చర్యలు సున్నా..

డబుల్‌ బెడ్రూం ఇళ్లలో లబ్ధిదారులు కాకుండా ఇతరులు ఉంటున్నారని, ఇంకొందరు అమ్ముకున్నారని తహసీల్దార్‌, ఎంపీడీఓ కార్యాలయాల్లో పలువురు ఫిర్యాదు చేశారు. అయినా నామమాత్రంగా విచారణ చేపట్టి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇందులో ఇళ్లు ఉండడంతోనే విచారణను పక్కదారి పట్టిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకొందరి ఇళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి లబ్ధిదారులు నివసించడం లేదని గుర్తించినా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి విక్రయాలు జరిపిన లబ్ధిదారులపై చర్యలు తీసుకుని నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement