సూపర్‌బజార్(కొత్తగూడెం): సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువుకు ఇటీవల భారీగా వరద వచ్చిన సమయాన చిక్కుకున్న మత్స్యకారులను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని తెలంగాణ స్పెషల్ పోలీస్ డీఐజీ పి. మురళీకృష్ణ అభినందించా రు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఆరో బెటాలియన్‌లో ఉద్యోగులకు ఆయన మంగళవారం ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మత్స్యకారులను రక్షించిన ఉద్యోగుల ధైర్యసాహసాలు అభినందనీయమన్నారు. చాతకొండ, గంగారం బెటాలియన్ల కమాండెంట్లు పీసీవీ.రమణ, పెద్ద బాబు, అధికారులు ఎస్.శ్రీధర్‌రాజా, ఏ.వీ.రమణయ్య, శోభన్‌బాబు, జె.లెనిన్‌బాబు, సీహెచ్‌వీ.శ్రీనివాసరెడ్డి, జీ.వీ.రామారావు, బి.జానయ్య తదితరులు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్య
కార్యక్రమాలపై సమీక్ష
చుంచుపల్లి: జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుడు ఎం.డీ.ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వీసీ మంగళవారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారులతో గర్భిణుల సంరక్షణ, వ్యాక్సినేషన్, 104, 108 సేవలు, మలేరియా, క్షయ, కుష్ఠు వ్యాధుల నివారణ, అసంక్రమిత వ్యాధులు, అంధత్వ నివారణ తదితర కార్యక్రమాల పురో గతిని సమీక్షించారు. వీసీ కి జిల్లా నుంచి డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, అదనపు డీఎంహెచ్‌ఓ సైదులు, అధికారులు పాల్గొన్నారు.
నేటి నుంచి సింగరేణి స్థాయి క్రికెట్ సమరం
రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో సింగరేణి స్థాయి క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ప్రారంభం కానున్నా యి. మూడురోజుల పాటు ఠాగూర్ స్టేడియం, మందమర్రి సింగరేణి స్కూల్ మైదానంలో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మందమర్రి – బెల్లంపల్లి సంయుక్త జట్టు, శ్రీ రాంపూర్ జట్టు, ఇల్లెందు – మణుగూరు సంయుక్త జట్టు, ఆర్‌జీ–1, ఆర్‌జీ–2 సంయుక్త జట్టు, ఆర్‌జీ –3, భూపాలపల్లి సంయుక్త జట్టు, కొత్తగూడెం కార్పొరేట్ జట్టు పోటీల్లో పాల్గొననున్నాయి. లీగ్ పద్ధతిలో భాగంగా ఆరు జట్లను రెండు పూల్స్‌గా విభజిస్తారు. లీగ్ మ్యాచ్‌ల అనంతరం రెండు పూల్స్‌లో అగ్రస్థానాన నిలిచిన జట్లు ఫైనల్స్‌లో తలపడుతాయి. ఇక్కడ ప్రతిభ కనబరిచే క్రీడాకారులతో కోలిండియా స్థాయి పోటీల్లో పాల్గొనే జట్టును ఎంపిక చేస్తారు.


