నేలకొండపల్లి: మండల కేంద్రంలోని బౌద్ధక్షేత్రం పరిసరాల్లో మంగళవారం డ్రోన్ ద్వారా సర్వే నిర్వహించారు. క్షేత్రం పరిసరాల్లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో చారిత్రక ఆధారాలు లభించిన విషయం విదితమే. ఈమేరకు బౌద్ధుల నివాసం ఉన్న ప్రాంతం ఎంత మేర ఉంటుందో గుర్తించేలా కలెక్టర్ ఆదేశాలతో డ్రోన్ సర్వే చేపట్టారు. బౌద్ధక్షేత్రం చుట్టూ ముజ్జుగూడెం, అనాసాగారం, సధాశివాపురం, బైరాగి గుట్ట, పాతకొత్తూరు, నేలకొండపల్లి ప్రాంతాల్లో దాదాపు వంద ఎకరాల విస్తీర్ణం మేర సర్వే నిర్వహిస్తూ వీడియోలు, ఫొటోలు చిత్రీకరించారు. క్షేత్రం పక్కన మరో ఎనిమిది ఎకరాల భూమి సేకరించి మ్యూజియం ఏర్పాటు చేయడమే కాక సమీపంలోని బాలసముద్రం చెరువును అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం చేపట్టిన సర్వే ఆధారంగా మాస్టర్ ప్లాన్‌లో ఈ పనులను పొందుపరుస్తారు.
వెలుగులోకి చారిత్రక ఆధారాలు
నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రం వద్ద బౌద్ధుల నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త తెలంగాణ చారిత్రక బృందం సభ్యులు ముజ్జుగూడెం, అనాసాగారం, సధాశివాపురం, కొత్తకొత్తూరు, పాతకొత్తూరు ప్రాంతాల్లో పరిశీలన చేయగా, ఆనాడు వాడినట్టు భావిస్తున్న ఇటుకలు, మట్టి పాత్రలు, ఇనుము కాల్చిన అవశేషాలను గుర్తించారు. అంతేకాక నీటి నిల్వ గుంటలను గుర్తించామని బృందం సభ్యుడు పసుమర్తి శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర కమిటి ప్రతినిధులు రామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వం మరింత లోతుగా పరిశోధనలు చేయాలని కోరారు.
చుట్టూ వంద ఎకరాల మేర పరిశీలన


