భద్రాచలంఅర్బన్: భద్రాచలం ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో నాలుగో రాష్ట్రస్థాయి సెవెన్ ఏ సైడ్ ఫుట్‌బాల్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల కు 12 జట్లు హాజరయ్యా యి. పోటీలను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఎస్‌ఎస్ 6 ఇన్‌ఫ్రా సీఈఓ సూరినేని శ్రీనివాస్, ఐటీసీ కాంట్రాక్టర్ ఉంగరాల వెంకట్రావు ప్రారంభించారు. సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు సలీం, ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్షుడు జకరయ్యతో పాటు చలపతి, కమిటీ సభ్యులు రవి, కోలా రాజు, నాగార్జున, మన్మధ, ప్రసాద్, హరీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఆదివాసీల ఆందోళన
చండ్రుగొండ: పట్టాల్లో ఉన్న విస్తీర్ణం మేరకు భూమి చూపించాలనే డిమాండ్‌తో ఆదివాసీలు చండ్రుగొండలోని తహసీల్ ఎదుట చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. శుక్రవారం వంటావార్పు చేసుకుని రాత్రి ఇక్కడే నిద్రించిన వారు శనివారం కూడా ఆందోళన కొనసాగించారు. దామరచర్ల శివార్లలోని 136 ఎకరాల సీలింగ్ భూములను అయన్నపాలెం, సీతాయిగూడెం గ్రామాలకు చెందిన 40 మంది ఆదివాసీ రైతులకు మూడు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో భూమి చూపించలేదు. లబ్ధిదారుల్లో ప్రస్తుతం 14 మందే జీవించి ఉన్నారు. ఈక్రమాన లోకాయుక్తను ఆశ్రయించగా ఈనెల 11వ తేదీలోపు అసైన్డ్ భూములను ఆదివాసీలకు క్షేత్రస్థాయిలో చూపాలని ఆదేశించింది. ఈమేరకు వారు ఆందోళన చేపడుతుండగా, రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయానికి హాజరు కావడం లేదు. ఆందోళనకు సంఘం నాయకులు రాజిని వెంకటేశ్వర్లు, ఎస్.సీతారాములు, వాసం నాగేశ్వరరావు నాయకత్వం వహిస్తున్నారు.
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ మేనేజర్‌గా పవన్
ఫ్యాక్టరీల పర్యవేక్షకుడిగా నాగబాబు
అశ్వారావుపేటరూరల్: ఆయిల్‌ఫెడ్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న పలు వురు ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. అశ్వారావుపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ మేనేజర్‌గా చేసిన కార్తీక్‌ను అవినీతి ఆరోపణలతో ఇటీవల సస్పెండ్ చేశారు. ఈ స్థానంలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరిగూడెం ఫ్యాక్టరీ ఇన్‌చార్జ్ పవన్‌కుమార్‌ను నియమించగా ఆయన శనివారం విధుల్లో చేరారు. అలాగే మేనేజర్ నాగబాబుకు అదనంగా కల్లూరిగూడెం, అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అంతేకాక దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీ డిప్యూటీ మేనేజర్ బాణాల వెంకటేష్‌ను కల్లూరుగూడెం ఫ్యాక్టరీ ఇన్‌చార్జ్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


