కొత్తగూడెంఅర్బన్/చుంచుపల్లి: వినియోగదారులకు తక్కువ తూకంతో సరుకులు విక్రయిస్తూ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కూచన మనోహర్ హెచ్చరించారు. శుక్రవారం కొత్తగూడెంలోని బాబుక్యాంప్, విద్యానగర్, పెద్దబజార్ ప్రాంతాల్లో బియ్యం, కిరాణా, జనరల్ స్టోర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 26 కిలోలుగా పేర్కొన్న బియ్యం బస్తాల్లో కేవలం 25 కిలోలే ఉన్నట్లు గుర్తించారు. ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై ఆరు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్యాకింగ్ చేసిన సరుకులపై నికర బరువును స్పష్టంగా ముద్రించాలని, ప్రకటించిన తూకం ప్రకారమే విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. వినియోగదారులు సైతం కొనుగోలు సమయంలో సరుకుల బరువును పరిశీలించాలని సూచించారు.


