60 ఇళ్ల తొలగింపు!
యోగానంద లక్ష్మీనరసింహాలయం వైపే భూసేకరణ
నష్టపరిహారం రూ.60 కోట్లుగా
ప్రాథమిక అంచనా
చప్టా దిగువ రోడ్డు పుష్కరాల్లోగా
అందుబాటులోకి
భద్రాచలం: గోదావరి పుష్కరాల దృష్ట్యా భద్రాచలం వద్ద చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా చప్టా దిగువ రోడ్డు విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. 42 అడుగుల వెడల్పు ఉన్న రహదారిని 60 అడుగులకు విస్తరించేందుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు భూసేకరణపై సర్వే పూర్తి చేశా రు. రోడ్డును ఇరువైపులా కాకుండా ఒకేవైపు మాత్ర మే విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. యోగానంద లక్ష్మీనరసింహాలయం వైపు ఉన్న ఇళ్లు, దుకాణాలు, స్థలాలనే సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. సుమారు 60ఇళ్ల తొలగింపుతోపాటు భూములకు పరిహారం కలిపి దాదాపు రూ.60 కోట్ల వరకు అవసరమవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది.
విస్తరణ ఒక వైపే..
గోదావరి ఘాట్ నుంచి రామాలయానికి చేరుకునే చప్టా దిగువ రహదారి 42 అడుగుల వెడల్పుతో ఉంది. సాధారణ రోజుల్లోనే ఈ మార్గంలో రాకపోకలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి వేళల్లో భక్తుల రద్దీతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. గోదావరి స్నానఘట్టాల నుంచి ఆలయానికి వచ్చే భక్తులు, వాహనాలు ఒకేసారి ఈ మార్గంలో ప్రయాణించా ల్సి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా యి. ఈ నేపథ్యంలో రహదారిని 60 అడుగులకు విస్తరించాలని మంత్రులు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. తొలుత రోడ్డుకు ఇరువైపులా సమానంగా విస్తరణ చేపట్టేలా అధికారులు సర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన అనంత రం విస్తరణ దిశను మార్చినట్లు తెలుస్తోంది. రహదారికి ఒకవైపు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతోపాటు, మరోవైపు యోగానంద లక్ష్మీనరసింహా లయం వైపు ఉన్న నిర్మాణాలను తొలగిస్తే ఆలయ పరిసరాలను కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. దీంతో రోడ్డు విస్తరణను పూర్తిగా లక్ష్మీనరసింహాలయం వైపే చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
నిర్వాసితులకు న్యాయం జరిగితేనే ముందడుగు
రోడ్డు విస్తరణకు సర్వే పూర్తయినా నిర్వాసితులకు న్యాయం జరిగితేనే ముందడుగే పడే పరిస్థితి నెలకొని ఉంది. ప్రతిపాదనలకు ఆమోదం, నిధుల విడుదల, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలు కొలిక్కి వస్తే రోడ్డు విస్తరణ పనులు వేగం పుంజుకుని పుష్కరాల నాటికి పూర్తయ్యే అవకాశం ఉంటుంది.
రోడ్డు విస్తరణకు మూడు రోజులుగా రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సర్వే నిర్వహించారు. కరకట్ట దిగువ భాగం నుంచి రామాలయం పడమటి వైపు వరకు ఉన్న ఇళ్లు, దుకాణాలు, ఖాళీ స్థలాలను గుర్తించి వివరాలు నమోదు చేశారు. భూముల విస్తీర్ణం, నిర్మాణాల స్వరూపం, ఇతర వివరా లను పరిశీ లించి నష్టపరిహార అంచనాలను రూపొందించినట్లు సమాచారం. ప్రాథమికంగా సుమారు 60 ఇళ్లను తొలగించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇళ్ల నిర్మాణాలకు సుమారు రూ.23కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేయగా, భూ ముల సేకరణకు మరో రూ. 40కోట్ల వరకు అవసరమవుతుందని ప్రాథమికంగా లెక్కలు వేసినట్లు సమాచారం. మొత్తంగా భూసేకరణ, నిర్మాణాల పరిహారం కలిపి సుమా రు రూ.60 కోట్లకు పైగా నిధులు అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించే పనుల్లో ఉన్నారు. కలెక్టర్ మరోమారు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి నివేదికపై సమీక్షించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


