ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి చెందిన రెండు బోట్లు బోల్తాపడటానికి ‘యాంకరింగ్ తాడు’ కారణమైంది. అందులో ఉన్న కానిస్టేబుల్ బానోతు బాలాజీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మత్స్యకారులు సమీపానికి చేరుకోగానే వారి వైపు యాంకరింగ్ తాడు బోటు నుంచి విసిరారు. అదికాస్త బోటు మోటారులో ఇరుక్కుపోవటంతో మొదట ఒక బోటు బోల్తా పడింది. ఆ వెనుకే వస్తున్న రెండో బోటు మొదటి దానిని తాకి బోల్తా కొట్టింది. దీంతో 11 మంది నీళ్లల్లో పడిపోయారు. మత్స్యకారుడు ధర్మరాజు లైఫ్ జాకెట్ లేకున్నా, ఆందోళన వ్యక్తమైనా సిబ్బందితో ఉండడంతో ఏమీ జరగలేదు. ఎస్డీఆర్ఎఫ్ సుశిక్షితులు కావడం, మానసికంగా, శారీరకంగా బలంగా ఉండడంతో రాత్రంతా చిమ్మచీకటి, చుట్టూ వరద పారుతున్నా చెట్లను ఆసరాగా చేసుకుని కాలం గడిపారు. తరచూ టార్చ్ లైట్లు వేస్తుండగా.. ఒడ్డు నుంచి అధికారులు వేసిన లైట్లు కనిపించడంతో ఆనవాళ్లు బయటపడ్డాయి.


