భద్రాచలంఅర్బన్: బేతుపల్లి చెరువు వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన సమయాన బోటు బోల్తా పడడంతో గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ బృందంలో భద్రాచలం అగ్నిమాపక కేంద్రం కానిస్టేబుల్ పేరం వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు. బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరు వాసి, మాజీ సైనికుడైన ఆయన కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. బోటు బోల్తా పడడంతో వరదలో కొట్టుకుపోయిన ఆయన మధ్యలో చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. బుధవారం రాత్రి 7గంటల నుంచి గురువారం ఉదయం సుమారు 11 గంటలపాటు చెట్టుపైనే ఉండగా.. ఆయనను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆయన గల్లంతైనట్లు తెలియడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు ఉదయం ఊపిరి పీల్చుకున్నారు.


